Bengaluru-Goa Vande Bharat: వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంటేనే వేగవంతమైన ప్రయాణానికి పెట్టింది పేరు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం చేరుకోవచ్చనే ఉద్దేశంతో భారతీయ రైల్వే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే, త్వరలో ప్రారంభం కానున్న బెంగళూరు-గోవా వందే భారత్ రైలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ రైలు దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే వందే భారత్ చైర్ కార్ సర్వీస్ గా గుర్తింపు పొందనుంది. ఎందుకంటే..
బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నుంచి గోవాలోని మడ్గావ్ మధ్య ఈ కొత్త వందే భారత్ రైలును నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, ఈ మార్గంలో ప్రయాణ సమయం ఎక్కువగా ఉండనుంది. యశ్వంత్‌పూర్ నుంచి మడ్గావ్ చేరుకోవడానికి సుమారు 12 గంటల 20 నిమిషాలు పడుతుంది. తిరుగు ప్రయాణానికి ఏకంగా 12 గంటల 55 నిమిషాల సమయం పట్టనుంది. ఈ రైలు సగటున గంటకు 53 నుంచి 54 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా నడిచే వందే భారత్ సర్వీసుల్లో వారణాసి-న్యూఢిల్లీ రైలు ముందుంది. ఇది సగటున గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, 759 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల్లో చేరుకుంటుంది. ఇక చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ గంటకు 82-83 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు గంటకు 79 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చెన్నై సెంట్రల్-నరసపుర సర్వీస్ సగటు వేగం గంటకు 75.73 కిలోమీటర్లు. పుణే-అజ్ని రైలు గంటకు 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, నాందేడ్-ముంబై సీఎస్ఎంటీ సర్వీస్ దిశను బట్టి గంటకు 65 నుంచి 68 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేస్తోంది.
బెంగళూరు-గోవా వందే భారత్ ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ మార్గంలోని రైల్వే ట్రాక్ పరిస్థితులు. ముఖ్యంగా మంగళూరు జంక్షన్ నుంచి మడ్గావ్ మధ్య రైల్వే లైన్లో ఎక్కువ భాగం సింగిల్ ట్రాక్‌గా ఉంది. దీంతో ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఒకదానికొకటి దారి ఇవ్వడానికి కొన్ని స్టేషన్లలో ఆగాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ట్రాక్ పరిస్థితుల కారణంగా రైళ్ల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేయాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రయాణ సమయం పెరగడానికి కారణమవుతున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కొత్త వందే భారత్ రైలు సగటు వేగం సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే కూడా తక్కువగా ఉండనుంది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 50-54 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ సగటు వేగం ఉన్న రైళ్లను సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా పరిగణిస్తారు. అంటే వందే భారత్ అనే పేరు ఉన్నప్పటికీ, బెంగళూరు-గోవా రైలు వేగం విషయంలో ప్రత్యేకంగా నిలవనుంది. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలతో కూడిన రైలు ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైలును తీసుకురాబోతున్నారు.
Read Also: రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!