Sonia Gandhi: ప్రధాని మోదీ 12 పాలనపై దేశ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యంగ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఓ ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనియా గాంధీ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిపోతోందన్న అభిప్రాయాలను ఈ సందర్భంగా ఆమె తోసిపుచ్చారు.
మీడియా సంస్థలపై కంట్రోల్, అపరిమిత ధనబలం, మతాన్ని రాజకీయం చేయడం వంటి చర్యలతో అధికార పక్షం వ్యవస్థలను అణచివేస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదంలో విద్యార్థుల నిరసనలకు దిగడం, ఆపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. దేశ ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని గుర్తుచేశారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన అవకతవకల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోందని సోనియా స్పష్టం చేశారు.
1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులపై కూడా తాజా ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడారు. సమాజంలో అల్లర్లు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టడం, ఆర్మీ – బ్యూరోక్రసీ ఉత్తర్వులను దిక్కరించాలనే పిలుపుల నేపథ్యంలో ఇందిరా గాంధీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఎమర్జెన్సీలో జరిగిన అతిక్రమణలను ఇందిరా గాంధీ స్వయంగా గుర్తించి 1977లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిణామాలకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారని స్పష్టం చేశారు.
Also Read: అమెరికా బంపరాఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెప్తే రూ.165 కోట్లు.. గిఫ్ట్‌గా యూఏస్ పౌరసత్వం!
మరోవైపు సోనియా గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. 1975లో ప్రజాస్వామ్యం గొంతు నులిమి, వేలాది మంది ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ విధింపును సోనియా సమర్థించుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ తొమ్మిది రాష్ట్రాల్లో గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారమే లేదని ఎద్దేవా చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల నోళ్లు మూయించిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు.
Also Read: కేబీఆర్ తరహాలో లక్డీకాపూల్‌లోనూ వన్-వే రూట్.. సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఎటు నుంచి వెళ్లాలంటే?