Airline Compensation: విమాన ప్రయాణాల్లో కొన్నిసార్లు ప్రయాణికుల తప్పిదం లేకపోయినా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఎయిర్ లైన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విమానం మిస్ అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఎయిర్ లైన్ సిబ్బంది కారణంగా మిస్సయ్యానని ఆరోపించిన ఓ ప్రయాణికుడికి వినియోగదారుల కమిషన్ భారీ ఊరటనిచ్చింది. ప్రయాణికుడు ఆలస్యంగా వచ్చాడని విమానయాన సంస్థ నిరూపించకపోవడంతో రూ.71,587 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ ఘటన 2025 జూన్‌లో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అత్యవసర మీటింగ్ కోసం ఢిల్లీ నుంచి బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానం ఉదయం 6.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే, తాను విమానం బయలుదేరడానికి గంట ముందే, అంటే ఉదయం 5.45 గంటలకే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని ప్రయాణికుడు తెలిపారు. చెక్ ఇన్ కోసం ప్రయత్నించినప్పటికీ ఎయిర్‌లైన్ సిబ్బంది సరైన సహకారం అందించలేదని ఆరోపించారు.
చెక్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడానికి సిబ్బంది 45 నిమిషాలకు పైగా ఆలస్యం చేశారని ప్రయాణికుడు వెల్లడించారు. అంతేకాకుండా విమానంలో సీట్లు పూర్తయ్యాయని ఓ గ్రౌండ్ స్టాఫ్ చెప్పి, రీషెడ్యూలింగ్ కోసం తనను హెల్ప్ డెస్క్ కు పంపించారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలోపే విమానం వెళ్లిపోయింది. ఎమర్జెన్సీ మీటింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉండటంతో అదే రోజు అదే ఎయిర్ లైన్ లో రూ.11,587 చెల్లించి మరో టిక్కెట్ కొనుగోలు చేశారు. దీంతో అదనపు ఖర్చుతో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
సమస్య అక్కడితో అయిపోలేదు. బెంగళూరు నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎయిర్‌లైన్ సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారని ప్రయాణికుడు ఆరోపించారు. మొదట బుక్ చేసుకున్న టిక్కెట్‌ను ఉపయోగించలేదనే కారణంతో చెక్-ఇన్‌కు అనుమతించలేదని తెలిపారు. తాను అదే ఎయిర్ లైన్ లో మరో టిక్కెట్ కొనుగోలు చేసినట్లు వివరించిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారని ఫిర్యాదులో వెల్లడించారు.
మరోవైపు ప్రయాణికుడు ఉదయం 6.10 గంటలకు మాత్రమే చెక్ ఇన్ కౌంటర్ వద్దకు వచ్చారని, నిర్ణీత సమయానికి రాకపోవడంతో అతడిని నో-షోగా పరిగణించామని ఎయిర్‌లైన్ వాదించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎయిర్‌లైన్ వాదనలను పరిశీలించింది. ప్రయాణికుడు ఆలస్యంగా వచ్చాడని నిరూపించడానికి సీసీటీవీ ఫుటేజ్ లేదా ఇతర బలమైన ఆధారాలను విమానయాన సంస్థ సమర్పించలేదని చెప్పిది.
ఎయిర్‌లైన్ సర్వీసులలో లోపం ఉన్నట్లు గుర్తించిన కమిషన్ ప్రయాణికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా రెండో టిక్కెట్ కోసం ఖర్చు చేసిన రూ.11,587ను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదన, వేధింపులకు పరిహారంగా రూ.50,000, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో ఎయిర్‌లైన్ మొత్తం రూ.71,587 పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
Read Also: బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!