విమాన ప్రమాదాలు కొన్ని మరీ విచిత్రంగా ఉంటాయి. అలాంటి కోవలోదే ఇది కూడా. అంటే ఇది విమానానికి జరిగిన ప్రమాదం కాదు, విమానం వల్ల జరిగిన ప్రమాదం. విమానం ఇంజిన్ లోకి లాగివేయబడిన ఓ వ్యక్తి ముక్కలు ముక్కలై చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటనలు అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఆ అరుదైన ఘటన తాజాగా మరోసారి జరిగింది. ఇటలీలోని మిలన్ బెర్గామో విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. టాక్సీవేలో నడుస్తున్న ఒక వ్యక్తి విమానం ఇంజిన్‌లోకి లాగివేయబడ్డాడు. అంతే ఆ ఇంజిన్ లో పడిన క్షణాల్లోనే ముక్కలు ముక్కలైపోయాడు. దీంతో ఆ విమానాన్ని ఆపివేశారు, విమానాశ్రయంలో కార్యకలాపాలు స్తంభించాయి.
ఇంజిన్ తో ఎప్పుడూ ప్రమాదమే..
విమానం పార్కింగ్ ప్లేస్ లో ఉన్నప్పుడు సహజంగా ఎవరూ ఇంజిన్ వైపు వెళ్లరు. ఒకవేళ వెళ్లినా ఇంజిన్ స్టార్ట్ చేయకముందే అక్కడినుంచి వచ్చేస్తారు. ప్రయాణికులకు కూడా ఆ వైపు వెళ్లే అవకాశం లేదు, కేవలం సిబ్బంది అది కూడా అప్పుడప్పుడు మాత్రమే ఇంజిన్ ప్రాంతానికి వెళ్తుంటారు. అందుకే ఇంజిన్ లో వ్యక్తులు ఇరుక్కుని చనిపోయిన ఘటనలు చాలా అరుదుగా మాత్రమే బయటకు వస్తుంటాయి. విమానం ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడతారు. అయితే ఇటలీలో జరిగిన ఘటన మాత్రం సంచలనంగా మారింది.
అత్యంత రద్దీ విమానాశ్రయం..
అయితే విమానం ఇంజిన్ లో ఇరుక్కుపోయి మరణించిన వ్యక్తి ప్రయాణికుడా లేక విమానాశ్రయ ఉద్యోగా అనే విషయం ఇంకా తెలియడంలేదు. బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైనా పొరపాటున ఇంజిన్ వద్దకు వెళ్లి అందులో చిక్కుకుపోయారా అనే అనుమానం కూడా ఉంది. ఇటలీలోని మూడో అత్యంత రద్దీ విమానాశ్రయం మిలన్ బెర్గామో. గతేడాది బెర్గామో విమానాశ్రయం ద్వారా 17 మిలియన్ల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ ఘటన తర్వాత ఆ విమానాశ్రయ కార్యకలాపాలు కాసేపు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ ప్రమాదానికి కారణం అయిన విమానం ఎయిర్‌బస్ A319-111, ఇది స్పెయిన్‌లోని అస్టురియాస్‌కు వెళ్లాల్సి ఉంది. బోర్డింగ్ పూర్తయి, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈ విమానం ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత ఈ దుర్ఘటన జరిగింది. ఇటాలియన్ పౌర విమానయాన శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా ప్రోటోకాల్ లను వారు పరిశీలిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి విమాన ప్రయాణం ప్రారంభమైన సమయంలో ఆ ప్రదేశానికి ఎలా వచ్చాడని ఎంక్వయిరీ చేస్తున్నారు.
ఇటీవల భారత్ లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత విమానాలు, విమానాశ్రయాల్లో జరిగిన దుర్ఘటనలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో చనిపోయింది ఒక వ్యక్తే అయినా ఈ సంఘటన మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంజిన్ లో ఇరుక్కుని వ్యక్తి చనిపోవడం అరుదైన ఘటన కావడంతో ఈ ఘటన ఇటలీ ఎయిర్ పోర్ట్ ని వార్తల్లోనిలిచేలా చేసింది.