Andaman Travel: బంగాళాఖాతపు అనంత జలరాశిలో.. ముత్యాల హారంలా విసిరివేయబడినట్లు ఉండే దీవుల సముదాయం. చుట్టూ నీలాల నింగిని తాకే సముద్రం.. మధ్యలో పచ్చని అడవుల దుప్పటి కప్పుకున్న భూభాగం. అదే అండమాన్ నికోబార్. మొత్తం 836 దీవుల అద్భుత ప్రపంచం. ప్రకృతి తన చేతులతో అల్లిన ఈ రమణీయ ప్రదేశంలో అడుగుపెడితే.. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. భారతీయులు.., మరీ ముఖ్యంగా.. దక్షిణాది వారు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన భూతల స్వర్గం.
అండమాన్ చరిత్ర కేవలం అందాలకు సంబంధించింది మాత్రమే కాదు, అది వేలాది ఏళ్ల తెగల సంస్కృతికి, మన స్వాతంత్ర్య పోరాట వీరగాథలకు సాక్ష్యం. అండమానీస్, నికోబారీస్ తెగలు ఇక్కడ వేల ఏళ్లుగా నివసిస్తున్నాయి. 11వ శతాబ్దంలో చోళ రాజులు ఈ దీవులను తమ నావికా స్థావరంగా మార్చుకున్నారు. ఆ తర్వాత బ్రిటీష్ వారు ఇక్కడ అడుగుపెట్టారు. 1858లో నిర్మించిన సెల్యులార్ జైలు భారతీయుల పాలిట కాలా పానీగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఆక్రమణ, ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకం రెపరెపలాడటం.. ఇలా అండమాన్ చరిత్ర ఎంతో సాహసోపేతమైనది. 1956లో ఇది భారత కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది.
అండమాన్ నికోబార్ దీవుల ముఖద్వారం, రాజధాని నగరం పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ పర్యటనలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం సెల్యులార్ జైలు. ఇక్కడ సాయంత్రం వేళ జరిగే లైట్ అండ్ సౌండ్ షో అద్భుతంగా ఉంటుంది. ఇది మన వీర జవాన్ల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పోర్ట్ బ్లెయిర్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న బీచ్..కార్బిన్స్ కోవ్ బీచ్. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన ఇసుక తిన్నెలు ఉంటాయి. జెట్ స్కీయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ఆస్వాదించవచ్చు. సాహస ప్రియులకు రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కరెక్ట్ అడ్డా. ఇక్కడ నుండి నార్త్ బే ఐలాండ్, రాస్ ఐలాండ్‌లకు బోట్లు ఎక్కవచ్చు. ఇక్కడ బనానా రైడ్, స్పీడ్ బోట్ రైడ్ వంటివి అందుబాటులో ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ నుండి చిన్న పడవ ప్రయాణం ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపానికి చేరుకోవచ్చు. ఒకప్పుడు ఇది బ్రిటీష్ వారి పరిపాలనా కేంద్రం. ప్రస్తుతం ఇక్కడ శిథిలావస్థలో ఉన్న చర్చిలు, బేకరీలు, అడవిలో తిరిగే జింకలు, నెమళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
అండమాన్ వెళ్లే ప్రతి పర్యాటకుని కలలో ఉండే ప్రదేశం హేవ్‌లాక్ ద్వీపం. దీనిని ప్రస్తుతం అధికారికంగా స్వరాజ్ ద్వీపం అని పిలుస్తున్నారు. ఈ ద్వీపంలోని మకుటాయమానమైన ఆభరణమే రాధానగర్ బీచ్. రాధానగర్ బీచ్ కేవలం అండమాన్‌లోనే కాదు, ఆసియాలోనే అత్యంత అందమైన బీచ్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడి ఇసుక వెండిలా మెరిసిపోతూ, మృదువుగా ఉంటుంది. స్ఫటికంలాంటి పచ్చ-నీలి రంగు నీరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్ వెంబడి ఉండే దట్టమైన ఉష్ణమండల అడవి సముద్ర తీరానికి పచ్చని అంచులా కనిపిస్తుంది. రాధానగర్ బీచ్ సూర్యాస్తమయానికి ప్రపంచ ప్రసిద్ధి. సాయంత్రం వేళ ఆకాశం కేసరి, గులాబీ, బంగారు రంగుల్లోకి మారుతుంటే, ఆ రంగులు సముద్రపు అలలపై ప్రతిబింబించడం ఒక అద్భుత దృశ్యం.
సాహసాలకు, జలక్రీడలకు చిరునామా ఎలిఫెంట్ బీచ్. అండమాన్ పర్యటనలో వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ బీచ్‌ను అస్సలు మిస్ అవ్వకూడదు. పూర్వం ఈ బీచ్‌కు ఏనుగులను తీసుకువచ్చి స్నానాలు చేయించేవారట, అందుకే దీనికి ఎలిఫెంట్ బీచ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ సముద్రపు నీరు చాలా తక్కువ లోతులో, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. తీరం వెంట కూలిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఈ బీచ్‌కు ఒక ప్రత్యేకమైన, సహజమైన రూపాన్ని ఇస్తాయి. ఈ తీరానికి చాలా దగ్గరలోనే అద్భుతమైన పగడపు దిబ్బలు ఉండటం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సముద్ర గర్భంలోని అద్భుత ప్రపంచాన్ని చూడాలనుకునే వారికి ఇది బెస్ట్. రంగురంగుల చేపలు, పగడాల మధ్య ఈత కొట్టడం మర్చిపోలేని అనుభవం. సీ వాక్, స్నార్కెలింగ్, పారాసైలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌ను ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.
అండమాన్ పర్యటనలో కాలాపత్తర్ బీచ్, నీల్ ఐలాండ్ వేర్వేరు అనుభూతులను ఇస్తాయి. కాలా పత్తర్ అంటే హిందీలో నల్లటి రాయి అని అర్థం. తెల్లటి ఇసుక తీరంలో అక్కడక్కడా మెరిసే నల్లటి పెద్ద బండరాళ్లు ఈ బీచ్‌కు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఇక్కడ సముద్రపు నీరు అత్యంత ముదురు నీలం, పచ్చ రంగుల కలయికలో అద్భుతంగా కనిపిస్తుంది కాలాపత్తర్ నుంచి నీల్ ఐలాండ్ సుమారు 1 గంట ప్రయాణం. ఈ చిన్న ద్వీపాన్ని అండమాన్ కూరగాయల గిన్నె అని పిలుస్తారు. ఇక్కడ వాతావరణం చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా సాగుతుంది. ఇక్కడ భరత్ పూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్‌లు ఫేమస్. ఇక్కడే ప్రసిద్ధమైన నేచురల్ బ్రిడ్జ్ ఉంది. సముద్రపు అలల కోత వల్ల రాళ్లు ఒక వంతెన ఆకారంలో ఏర్పడ్డాయి. దీనిని హౌరా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు.
అడ్వెంచర్, ప్రకృతి వైవిధ్యాన్ని ఇష్టపడే వారు అండమాన్ పర్యటనలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం..బరాటాంగ్ ద్వీపం, బర్డ్ ఐలాండ్. పోర్ట్ బ్లెయిర్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాటాంగ్ ద్వీపం.. దట్టమైన అడవులు, వింతైన భౌగోళిక నిర్మాణాలకు నిలయం. బరాటాంగ్ వెళ్లే మార్గంలో జారవా అనే పురాతన ఆదిమ తెగ నివసించే అడవుల గుండా ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో వాహనాలను కాన్వాయ్ లుగా మాత్రమే అనుమతిస్తారు. బరాటాంగ్ చేరుకున్నాక, దట్టమైన మడ అడవుల మధ్య నుండి స్పీడ్ బోట్‌లో ప్రయాణించి ఈ గుహలకు చేరుకోవాలి. వేల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ గుహల్లోని సున్నపురాయి ఆకృతులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. భారతదేశంలో బురదను వెదజల్లే ఏకైక అగ్నిపర్వతం మడ్ వాల్కనో ఇక్కడే ఉంది. ఇక బర్డ్ ఐలాండ్‌ను చిడియా తపు అని పిలుస్తారు. పోర్ట్ బ్లెయిర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం పక్షుల ప్రేమికులకు, ప్రశాంతతను కోరుకునే వారికి స్వర్గం. ఇక్కడ సుమారు 240కి పైగా అరుదైన పక్షుల జాతులు కనిపిస్తాయి. ఉదయాన్నే వెళ్తే రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో ఈ ప్రాంతం మారుమోగుతుంది. సాహస ప్రియుల కోసం ఇక్కడ ఒక చిన్న ట్రెకింగ్ మార్గం ఉంది. కొండ పైకి నడుస్తూ వెళ్తే అనంతమైన సముద్రపు దృశ్యాలు కనిపిస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి విమాన మార్గం, సముద్ర మార్గం అనే రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రధాన నగరాల నుండి విమాన సర్వీసులు ఉన్నాయి. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నుండి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. సమయం ఉండి, సముద్రంపై సుదీర్ఘ ప్రయాణం చేయాలని ఉంటే షిప్‌ల ద్వారా వెళ్లవచ్చు. చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం ఓడరేవుల నుండి ప్రభుత్వ ఓడలు నడుస్తాయి. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఇతర బీచ్‌లు, ప్రాంతాలకు చేరుకోవడానికి స్థానిక పడవులు నడుస్తాయి. ఇక్కడ హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ప్రకృతి అందం, చరిత్ర సారం, సాహసాల విందు.. ఇవన్నీ కలగలిసిన అద్భుతమే అండమాన్ నికోబార్. ఒక్కసారి ఇక్కడికి వస్తే మనసు ఇక్కడే ఉండిపోతుంది. మంచు కొండల కంటే, ఈ నీలి సముద్రపు లోతులు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? బ్యాగులు సర్దేసుకోండి.. అండమాన్ పిలుస్తోంది!
Story by: Kanugula Kishan, Big Tv