AP Tent Cities: దేశంలోని ప్రతీ రాష్ట్రాలు టూరిజానికి మొదట ప్రయార్టీ ఇస్తున్నాయి. పర్యాటకుల అభిరుచి మేరకు కొన్ని ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు.. ఆపై సక్సెస్ అయ్యాయి కూడా. ఇప్పుడు వాటిని ఏపీకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి చంద్రబాబు సర్కార్ ఆమోదముద్ర వేయడం చకచకా జరిగింది? ఇంతకీ టెంట్ సిటీ అంటే ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పర్యాటకులు ఎక్కడికైనా వెళ్తే మంచి హోటళ్లు బుక్ చేసుకునేవారు. ప్రస్తుతం చాలా మంది అభిరుచి మారుతోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ టూరిజం ప్రాంతాల్లో టెంట్‌ల్లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. వివిధ దేశాల్లో ఫేమస్ బీచ్ ప్రాంతాల్లో ఆ తరహా టెంట్ సిటీలు ఉన్నాయి.
అదే విధంగా దేశంలోని గుజరాత్ లోని కెవాడియాలో రెండు టెంట్ సిటీలు ఉన్నాయి. ఆ తర్వాత అయోధ్యలో ఈ తరహావి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీలో టూరిస్టులు అధికంలో వచ్చే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడం, ఆపై ఆమోదముద్ర పడింది కూడా. వీటికి స్టార్ హోటళ్ల మాదిరిగా సదుపాయాలు కల్పిస్తారు. కాకపోతే ప్రకృతి ఆస్వాదిస్తూ గడపడం అన్నమాట.
ఇండియాలోని పర్యాటకులు మాత్రమేకాదు.. విదేశీయులు సైతం వీటిని అధికంగా ఇష్టపడుతున్నారు. ఏపీలో పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో మూడు కీలకమైనవి. వాటిలో ఒకటి ఉమ్మడి విశాఖ జిల్లా అరకు కాగా, రెండోది బాపట్లలోని సూర్యలంక, మూడోది కడప జిల్లా గండికోట.
ALSO READ: ఏపీలో అండమాన్.. ఇదొకటి ఉందా? ఇప్పుడు బ్యాగ్ సర్దుకోండి
ఈ మూడు ప్రసిద్ధమైన ప్రాంతాలు కావడంతో టూరిస్టులు అధికంగా వస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకున్న ఏపీ టూరిజం శాఖ, ఆయా ప్రాంతాల్లో టెంట్ సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అరకులో ఏపీ టూరిజం నిర్మించాలని భావిస్తోంది. మిగతా రెండు ప్రాంతాల్లో ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో టెంట్ సిటీల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు పలు ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థల ద్వారా 8,073 గదులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో హోటళ్ల నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు దృష్టి సారించాయి.
అరకులో ఏపీ టీడీసీ పది ఎకరాల విస్తీర్ణంలో టెంట్ సిటీని ఏర్పాటు చేయనుంది. దాదాపు 50 గదులు నిర్మించాలని భావిస్తోంది. గండికోటలో పది ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో తీసుకురానుంది. అక్కడ 60 గదులు అందుబాటులోకి వస్తాయని ఆలోచన చేస్తోంది. పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే బాపట్లలోని సూర్యలంక బీచ్ ఒకటి. 10 ఎకరాల్లో పీపీపీ విధానంలో 50 గదులతో టెంట్ సిటీని అభివృద్ధి చేయనుంది.
పర్యాటకులు దర్శనీయ ప్రాంతాల్లో హోం స్టే విధానాన్ని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వం ప్లాన్. గ్రామాల్లో పాత ఇళ్లను గుర్తించి పర్యాటకులకు సొంత ఇంటి అనుభూతి కలిగేలా వాటిని ఆధునికరించ నుంది. ఆ తరహా పద్దతి కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఇప్పటికే ఉంది. అక్కడికి దేశీయంగా కాకుండా విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఇంట్లోనే హోం థియేటర్ పద్దతి, ఇంటర్నెట్ ఇలా రకరకాల సదుపాయాలు కల్పించింది అక్కడి ప్రభుత్వం.
స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు అన్ని వసతులు అక్కడ కల్పించారు. వచ్చిన రోజే తిరిగి వెళ్లిపోవాలన్న ఆలోచన పర్యాటకుల్లో రాకూడదన్నది మొదటి ఆలోచన. మంచి వాతావరణం ఉంటే రెండు లేదా మూడు రోజులైనా ఆ ప్రాంతంలో ఉండేలా వసతులు కల్పించనుంది ఏపీ ప్రభుత్వం.