Charlapalli Railway station: హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో ఆపరేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఇక్కడి నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు చర్లపల్లి రైల్వే స్టేషన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి రైల్వే స్టేషన్ ను తెలంగాణలో ఎక్కడా చూడలేదంటున్నారు. అచ్చం ఎయిర్ పోర్టు మాదిరిగానే ఉందంటున్నారు. రైల్వే స్టేషన్ లోని సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించి, ప్రయాణీకులకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
నవంబర్ 30న ప్రారంభించాల్సి ఉన్నా..
వాస్తవానికి ఈ రైల్వే స్టేషన్ ను నవంబర్ 30న కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించాల్సి ఉన్నా, వాయిదా పడింది. త్వరలోనే ఈ రైల్వే టెర్మినల్ ను ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి చర్లపల్లి స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని భావించినా, ఆ తర్వాత రైల్వే మంత్రి ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకూ ఎవరు ప్రారంభిస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారు? అనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది
రూ.430 కోట్లతో నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి రైల్వే స్టేషన్ ను రూ. 430 కోట్లతో నిర్మించింది. ఎయిర్ పోర్టును తలదన్నేలా ఈ టెర్మినల్ ను నిర్మించింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ శాటిలైట్ టెర్మినల్ ను ఏర్పాటు చేసింది. రెండు అంతస్తులలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ తెలంగాణలోని అతిపెద్ద స్టేషన్లలో ఒకటిగా నిలువనుంది. ఈ స్టేషన్ లో మొత్తం 9 ఫ్లాట్ ఫారమ్ లను నిర్మించారు. మొత్తం 19 రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రయాణీకులకు అనుకూలంగా గ్రౌండ్ ఫ్లోర్ లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ఇప్పటికే పలు రైళ్ల రాకపోకలు ప్రారంభం
త్వరలో ఈ రైల్వే స్టేషన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో రైల్వేబోర్డు కీలక అనుతులు జారీ చేసింది. చర్లపల్లి నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు ఓకే చెప్పింది. ఇక్కడి నుంచి షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్, గోరఖ్ పూర్- సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రాకపోకలుకొనసాగిస్తున్నాయి. విజయవాడ- సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, గుంటూరు- సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ అవకాశం ఇచ్చారు. ఈ రైల్వే స్టేషన్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది.
Read Also: మెట్రో కొత్త కారిడార్‌లలో వచ్చే స్టేషన్స్ ఇవే.. మ్యాప్‌లతో సహా పూర్తి వివరాలు మీ కోసం!