శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత శక్తివంతమైన క్షేత్రం. భూలోక కైలాసంగా పిలిచే శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తలు తరలి వస్తారు. ప్రకృతి అందాల నుడమ ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తూ చక్కటి అనుభూతిని పొందుతారు. రోడ్డుకు ఇరువైపులా వన్యప్రాణాలను చూస్తూ, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. శ్రీశైలం ప్రయాణం అనగానే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇక విజయవాడ నుంచి శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు, పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి(నవంబర్ 9) నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
కేవలం గంటన్నరలో విజయవాడ నుంచి శ్రీశైలానికి..
విజయవాడ-శ్రీశైలం నడుమ సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. వాస్తవానికి విజయవాడ-శ్రీశైలం నడుమ మధ్య 270 కిలో మీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా కనీసం నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నరలోనే చేరుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఏపీలో రెండు రకాల సీటింగ్ కెపాసిటీ ఉన్నసీ ప్లేన్స్ ను అధికారులు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి 14 సీట్ల కెపాసిటీ ఉండగా, మరొకటి 19 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రయల్ రన్ తర్వాత.. ఖర్చు, మెయింటెనెన్స్ సహా ఇతర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పటి నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలి? ఎన్ని సర్వీసులను అందుబాటులో ఉంచాలి? టికెట్ ఖర్చు ఎంత నిర్ణయించాలి? అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ విజయవాడ-శ్రీశైలం సీప్లేన్ సేవలు సక్సెస్ అయితే, మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నారు. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించే దిశగా ఆలోచిస్తామన్నారు ఏపీ టూరిజం.
శ్రీశైలంలో సీ ప్లేన్ ల్యాండింగ్ ఎక్కడంటే?
సీ ప్లేన్ సేవలు కొనసాగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. సీ ప్లేన్ టేకాఫ్ కావాలన్నా, ల్యాండింగ్ కావాలన్నా సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పులో నీళ్లు ఉండాలి. ప్రయాణీకులు ఎక్కాలన్నా, దిగాలన్నా నీటి మీద స్పెషల్ జెట్టీలు అవసరం. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ పరిధిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి సీ ప్లేన్ టేకాఫ్ అయి, శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో దిగనుంది. అక్కడి నుంచి పర్యాటకులు బోటు ద్వారా పాతాళగంగకు చేరుకునే అవకాశం ఉంటుంది. పాతాళగంగం దగ్గర ప్రయాణీకులు దిగుతారు. రోప్ వే ద్వారా శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీశైలం పర్యటన అయ్యాక, తిరిగి ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ఎక్కి విజయవాడ పున్నమి ఘాట్ కు చేరుకుంటారు.
Read Also: ఆ రైళ్లు.. డ్రైవర్ లేకుండానే నడుస్తాయట.. లోకో పైలెట్లతో పనేలేదట, ఎక్కడో కాదు మన దగ్గరే!