Indian Railways: రైల్వే పోలీసులు పక్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్రమార్కులు కొత్త తరహా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు చిన్నపిల్లలు, మాదక ద్రవ్యాలు, బంగారం, కలప, తాబేళ్లు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడగా, తాజాగా బతికి ఉన్న కప్పల బస్తాలను పోలీసులు గుర్తించారు. అస్సాంలోని సిల్చార్ రైల్వే స్టేషన్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది బతికి ఉన్న కప్పల బస్తాలను పట్టుకున్నారు. ప్లాట్ ఫామ్ నంబర్ 1 సమీపంలో కొన్ని అనుమానిత బస్తాలను గమనించారు. వాటిని ఓపెన్ చేయడంతో అందులో బతికి ఉన్న కప్పలు ఉన్నాయి. ఒక్కో బస్తాలో 150 కప్పలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 450 కప్పలను రెస్క్యూ చేశారు. అయితే, ఈ బస్తాలు ఎవరు తీసుకొచ్చారు? అనేది తెలియదు. సీసీ కెమెరాల ఆధారంగా వాటిని తీసుకొచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు.
ఫారెస్ట్ అధికారులకు కప్పల అప్పగింత
రైల్వే స్టేషన్ లో పట్టుకున్న కప్పలను సురక్షితంగా ఉంచేందుకు సిల్చార్ లోని బరాక్ వ్యాలీ వైల్డ్ లైఫ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ కు అప్పగించారు. ఆ కప్పలను అటవీ ప్రాంతంలోని నీటిలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను, రైల్వే ఆస్తిని కాపాడటమే కాకుండా వన్యప్రాణులను కాపాడటంలోనూ RPF చురుకైన పాత్ర పోషిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
మయన్మార్ నుంచి అక్రమ రవాణా
వాస్తవానికి మిజోరాం, మణిపూర్ నుంచి పలు రకాల వన్యప్రాణులను మయన్మార్ కు అక్రమంగా రవాణా చేయబడతాయి. ఏప్రిల్ 2న అస్సాం రైఫిల్స్, మిజోరం అటవీ శాఖ అధికారులతో సంయుక్త ఆపరేషన్‌లో అస్సాంలోని చాంఫాయి జిల్లాలో అనేక రకాల ఇతర దేశ వన్యప్రాణుల జాతులను గుర్తించారు. ముగ్గురు మయన్మార్ జాతీయులను అరెస్టు చేశారు. వీళ్లు మయన్మార్ నుంచి కంటేనర్లలో పలు రకాల వన్యప్రాణులను తరలిస్తూ భారతీయ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. వీటిలో మూడు పటాగోనియన్ మారాలు, 24 ఆఫ్రికన్ స్పర్డ్ తాబేళ్లు, ఒక అల్బినో బర్మీస్ పైథాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వన్యప్రాణుల విలువ సుమారు రూ. 1.31 కోట్లు ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న అధికారులపై వైల్డ్ లైఫ్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గతంలోనూ వన్యప్రాణుల పట్టివేత
గతంలోనూ పలు సందర్భాల్లో మయన్మార్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి మయన్మార్ కు అక్రమంగా రవాణా చేస్తున్న పలు రకాల వన్యప్రాణులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. మయన్మార్ లోని చిన్ రాష్ట్రం, ఆరు మిజోరం జిల్లాల(చాంఫాయి, సియాహా, లాంగ్ట్లై, హ్నాథియల్, సైతువల్, సెర్చిప్) ద్వారా వివిధ రకాల మాదకద్రవ్యాలు, వన్యప్రాణులు, ఇతర నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతుంది. మిజోరం.. మయన్మార్, బంగ్లాదేశ్ తో 510 కి.మీ, 318 కి.మీ కంచె లేని సరిహద్దును పంచుకుంటుంది. ఈ బార్డర్ ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది.
Read Also: ఇండియా నుంచి అమెరికా ప్రయాణం, జస్ట్ 18 నిమిషాల్లోనే, మస్క్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!