రైల్లో ప్రయాణిస్తున్న ఓ శిశువు ప్రాణాలు కాపాడి తోటి ప్రయాణీకుల ప్రశంసలు పొందాడు ఓ ఆర్మీ జవాన్. న్యూఢిల్లీ- దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత సైన్యంలో అంబులెన్స్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జవాన్.. ఆపదలో ఉన్న శిశువుకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సెలవులు పూర్తి కావడంతో మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తున్న భారత సైన్యంలోని అంబులెన్స్ అసిస్టెంట్ రైలులో ఉన్న ఎనిమిది నెలల శిశువుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈశాన్య ప్రాంతంలోని ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సిపాయి సునీల్, న్యూఢిల్లీ-దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నప్పుడు శిశువుకు శ్వాస సమస్య తలెత్తింది. ఆయన వెంటనే స్పందించి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ఇచ్చి శిశువును కాపాడాడు. తక్షణ వైద్య సహాయం అందుబాటులో లేని పరిస్థితిలో ఆర్మీ జవాన్ చేసిన అత్యవసర చికిత్స శిశువును ప్రాణాపాయం నుంచి కాపాడిందని రక్షణ అధికారి ప్రకటనలో వెల్లడించారు. “ఈ వారం ప్రారంభంలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎనిమిది నెలల శిశువుకు అకస్మాత్తుగా శ్వాసకోశ ఇబ్బంది వచ్చింది. శిశువు స్పందించడం మానేశాడు. శిశువు చనిపోయిందని భావించి తల్లి మూర్ఛపోయింది. ఇతర కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. 456 ఫీల్డ్ హాస్పిటల్ లో సిపాయి (అంబులెన్స్ అసిస్టెంట్) సునీల్ సెలవు నుంచి తిరిగి వస్తుండగా అదే కోచ్‌లో ఉన్నాడు. అతడు వెంటనే వారికి సహాయం చేయడానికి పరుగెత్తాడు. శిశువును పరీక్షించిన తర్వాత, పల్స్, శ్వాస లేదని గుర్తించారు. సునీల్ వెంటనే శిశువు ఛాతీ మీద రెండు వేళ్లను ఉపయోగించి పీడియాట్రిక్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ చేశాడు. బిడ్డకు నోటి నుంచి శ్వాస అందించాడు. కాసేపు అలాగే చేసిన తర్వాత శిశువులో కదలిక వచ్చింది” అని ఆయన వివరించారు.
Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!
జవాన్ తక్షణ సాయంతో శిశువు ప్రాణాపాయం నుంచి కోలుకోగా, అస్సాంలోని రంగియా స్టేషన్ లో శిశువుకు చికిత్స అందించేందుకు జవాన్ రైల్వే, పోలీసు అధికారులు సమాచారం అందించారు. రైలు స్టేషన్ కు వెళ్లే సరికి అక్కడ వైద్య బృందం రెడీగా ఉంది. అక్కడ చిన్నారికి మెరుగైన చికిత్స అందించారు. జవాన్ వెంటనే స్పందించడంతో ఒక విలువైన ప్రాణం నిలబడిందని ఆర్మీ అధికారి తెలిపారు. జవాన్ చేసిన పనిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. అటు రైల్లోని ప్రయాణీకులు కూడా జవాన్ పై ప్రశంసలు కురిపించారు.
Read Also: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!