Bengaluru Rape Case: గత కొద్ది వారాలుగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో వరుస దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కర్నాటకలోనూ మరో ఘోరం జరిగింది. రైల్వే స్టేషన్ లో దిగి బంధువుతో కలిసి వెళ్తున్న ఓ యువతిని దుండగులు అడ్డగించారు. బంధువుపై దాడి చేసి, యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. వారిని చూసి పారిపోతున్న ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 1.20 నుంచి 1.45 గంటల మధ్యలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పోలీసులు కథనం ప్రకారం.. 19 ఏండ్ల బాధితురాలు బీహార్ లోని బాంకా జిల్లాకు చెందినది. ఆమె తన కుటుంబంతో పాటు నెల రోజుల క్రితం ఏలకుల తోటలో పని చేసేందుక కేరళలోని కట్టప్పన్ ప్రాంతానికి వెళ్లారు. సీజన్ ముగియడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని బెంగళూరులోని తన సోదరుడికి చెప్పింది. అతడు వారందరినీ రైల్వే స్టేషన్ లో దిగమని చెప్పాడు. అక్కడే ఫుడ్ తిని మరో రైల్లో వెళ్లవచ్చు అన్నారు. బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్‌కు చేరుకునే ముందు, ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది. తెల్లవారు జామున 1:13 గంటలకు వాళ్లు స్టేషన్ కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా స్టేషన్ లో దిగారు. వారందరినీ అక్కడే ఉంచి, సదరు యువతి, సోదరుడు కలిసి ఫుడ్ తీసుకురావడానికి బయటకు వచ్చారు.
ఫుడ్ కోసం వెళ్తుండగా దారుణం
ఇద్దరూ కలిసి ఫుడ్ కోసం మహాదేవపుర వైపు నడుచుకుంటూ వెళ్లున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. వారిలో ఒకడు బాధితురాలి సోదరుడి మీద దాడి చేశాడు. మరో వ్యక్తి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత సదరు వ్యక్తి బయటకు రాగా, ఇంకో వ్యక్తి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో రోడ్డు మీద వెళ్లేవాళ్లు సంఘటనా స్థలానికి వెళ్లారు. జనాలు రావడాన్ని చూసి దుండగులు పారిపోయారు. జనాలు వారిని వెంబడించి ఆసిఫ్ అనే దుండగుడిని పట్టుకని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఇక యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆసిఫ్ అనే వ్యక్తి పోలీసులు అదుపులో ఉండగా, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. త్వరలోనే మిగతా నిందితుడిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Read Also: ‘మనీ హీస్ట్’ చూసి బ్యాంకుకు కన్నం, ఏకంగా 17 కిలోల బంగారం కొట్టేసి..