Indian Railway Stations: బాలీవుడ్ కు సంబంధించిన పలు సినిమాలు భారతీయ రైల్వే స్టేషన్లలో చిత్రీకరించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నుండి లవర్ బాయ్ షాహిద్ కపూర్ వరకు.. అనేక మంది నటులు నిజమైన రైల్వే స్టేషన్లలో జరిగిన షూటింగ్స్ లో పాల్గొన్నారు. ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి కూడా. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
⦿ ఆరాధన- హిమాలన్ టాయ్ ట్రైన్
‘మేరే సప్నోకి రాణి కబ్ ఆయేగి తు’ అనే పాట సినీ లవర్స్ అందరికీ తెలిసింది. 1969లో రాజేష్ ఖన్నా. షర్మిలా ఠాగూర్ కలిసి నటించిన ‘ఆరాధన’ సినిమాలోని ఈ పాట ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా పాటను సిమ్లాలోమంచుతో కప్పబడిన ప్రకృతి అందాల నడుమ చిత్రీకరించారు. డార్జిలింగ్ హిమాలయన్ టాయ్ రైలులో పలు సీన్లను తెరకెక్కించారు.
⦿ DDLJ- ఆప్తా రైల్వే స్టేషన్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లీ జాయేంగే’. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ మొత్తం సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. కాజోల్ తండ్రి అమ్రేష్ పురి షారుఖ్ ఖాన్ చేతిని పట్టుకునే సన్నివేశంలో నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. DDLJలోని ఈ సన్నివేశాన్ని మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని ఆప్తా రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించారు.
⦿ దిల్ సే- ఊటీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో
మణిరత్నం, షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన ‘దిల్ సే’ సినిమాలో ‘చయ్యా చయ్యా’ పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసింది. నిజానికి ఈ పాటను ఊటీ రైల్వే ప్లాట్ ఫారమ్ మీద షూట్ చేయాలి అనుకున్నారు. కానీ, రైల్వే అధికారులు పర్మీషన్ ఇవ్వకపోవడంతో కలుతున్న రైల్లో షూట్ చేశారు.
⦿ స్వదేస్- ఆప్తా రైల్వే స్టేషన్
షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేస్’ సినిమాలోని పలు సన్నివేశాలను రైల్లో షూట్ చేశారు. మహారాష్ట్రలోని పన్వేల్ కు సమీపంలో ఉన్న ఆప్తా రైల్వే స్టేషన్ లో ఈ సన్నివేశాలను తెరకెక్కించారు.
⦿ పరిణీత- ఆప్తా రైల్వే స్టేషన్
సైఫ్ అలీ ఖాన్, విద్యాబాలన్ నటించిన ‘పరిణీత’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ‘కస్తో మజా హై రైలైయామా’ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను మహారాష్ట్రలోని ఆప్తా రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు.
⦿ జబ్ వి మెట్-కల్కా-సిమ్లా స్టేషన్
ఇక షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ నటించిన ‘జబ్ వి మెట్’ చిత్రంలో కొన్ని సన్నివేశాలను కల్కా-సిమ్లా రైల్వే స్టేషన్లలో షూట్ చేశారు. మరికొన్ని సీన్లను మధ్యప్రదేశ్ లోని రత్లాం రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు. సినిమా అంతా ఈ రైల్వే స్టేషన్ సీన్ తోనే మారిపోతుంది.
⦿ చెన్నై ఎక్స్ ప్రెస్- వాస్కోడిగామా రైల్వే స్టేషన్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో అందమైన రైలు సన్నివేశాలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించినప్పటికీ, మరికొన్ని సన్నివేశాలను వాస్కోడి గామా రైల్వే స్టేషన్ లో తెరకెక్కించారు.
Read Also: ఏపీ నుంచి కుంభమేళాకు స్పెషల్ ట్రైన్లు, తెలంగాణ భక్తులకూ గుడ్ న్యూస్!