అస్సాంలో గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే పట్టాలను ధ్వంసం చేశారు. కోక్రాజర్ జిల్లాలోని రైల్వే ట్రాక్ పై అనుమానిత ఇంప్రూవైజ్డ్ పేలుడు డివైజ్(IED) పేల్చారు. ఈ ఘటనతో ఉత్తర బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో రైల్వే సేవలు నిలిచిపోయాయి. రాత్రి సమయంలో సలకటి వైపు వెళ్లే మార్గంలో కోక్రాజర్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా దాదాపు మూడు అడుగుల రైల్వే లైన్ ధ్వంసం అయినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న ట్రాక్ శకలాలు దూరంగా ఎగిరి పడ్డట్లు తెలిపారు.
అటు ఈ ఘటనపై కోక్రజర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పుష్పరాజ్ సింగ్ స్పందించారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. రైల్వే పట్టాలు మాత్రం ధ్వంసం అయినట్లు వివరించారు. “ట్రాక్ కొద్ది భాగం దెబ్బతిన్నది. దానిని కొద్ది గంటల్లోనే మర్మతులు చేశారు. ఇప్పుడు రైలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి” అని ఆయన వెల్లడించారు.
అటు ఈ ప్రమాదం తర్వాత రాత్రిపూట రైలు సర్వాసులు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోయర్ అస్సాం, ఉత్తర పశ్చిమ బెంగాల్ లోని అనేక అప్ అండ్ డౌన్ రైళ్లు ఉదయం 8 గంటల వరకు నిలిచిపోయాయన్నారు. రైల్వే, భద్రతా సిబ్బంది ప్రభావిత విభాగంలోక్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత మళ్లీ రైల్వే సేవలు మొదలు పెట్టినట్లు వివరించారు. ఆ మార్గంలో రైల్వే ట్రాక్ లను పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నట్లు తెలిపారు.
అటు ఈ పేలుడుకు పాల్పడిన వారిని పట్టుకునేందకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ పేలుడు పాల్పడింది ఎవరై ఉంటారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అలీపుర్దువార్ డివిజన్ పరిధిలోని కోక్రాజర్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని వెల్లడించారు. “సలకతి, కోక్రజర్ మధ్య గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు, రైలు మేనేజర్ భారీ కుదుపును గుర్తించాడు. ఆ తర్వాత రైలు ఆగిపోయింది. తనిఖీ చేస్తున్నప్పుడు, అనుమానిత బాంబు పేలుడు కారణంగా ట్రాక్, స్లీపర్ లు ధ్వంసం అయ్యాయని తేలింది. రాష్ట్ర పోలీసులు, రైల్వే రక్షణ దళం (RPF), నిఘా అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 5.25 గంటలకు ట్రాక్ పునరుద్ధరించబడింది. సాధారణ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సంఘటన కారణంగా సుమారు ఎనిమిది రైళ్లను నిలిపివేశారు” అని ఆయన తెలిపారు. సంఘటన తర్వాత, ఆ విభాగంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయబడిందని వివరించారు. త్వరలోనే ఘటనకు కారణం అయినవారిని పట్టుకుంటామని శర్మ వెల్లడించారు.
Read Also: ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!