Bombay HC on Train Safety: సుదూర రైలు ప్రయాణం చేసే ప్రయాణికుల భద్రత కోసం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అన్ని లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో కూడా భద్రతా ప్రకటనలు తప్పనిసరిగా చేయాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా, రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందో? ఎక్కడ ఆగదో? ముందుగానే ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో అమలు చేస్తున్న పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్ ను అన్ని సుదూర రైళ్లకు విస్తరించాలన్నది. వందే భారత్ రైళ్లలో స్టేషన్లు, ప్రయాణ సమాచారం గురించి ముందుగానే స్పష్టంగా వివరిస్తారు. ఇదే విధానం అన్ని రైళ్లలో ఉంటే ప్రమాదాలను తగ్గించవచ్చని కోర్టు సూచించింది.
తాజాగా బాంబే హైకోర్టు ఒక పాత కేసు తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సుమారు పదేళ్ల క్రితం జల్గావ్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. ఈ ఘటనను పరిశీలించిన కోర్టు, ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి సరైన సమాచారం ఇవ్వడం ఎంతో అవసరమని స్పష్టం చేసింది. ఈ కేసులో గాయపడిన ప్రయాణికుడికి రూ.80,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మొదట రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అతని విజ్ఞప్తిని తిరస్కరించినప్పటికీ, హైకోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రయాణికుడు రైలు ఆ స్టేషన్‌లో ఆగుతుందని భావించి ప్రయాణం చేశాడని, అతనిని పూర్తిగా తప్పుపట్టలేమని కోర్టు వెల్లడించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. లోకల్ ట్రైన్లలో ఎక్కడ ఆగుతుందో చూపించే డి స్‌ప్లే బోర్డులు, ప్రకటనలు ఉంటాయి. కానీ, సుదూర రైళ్లలో ఇలాంటి వ్యవస్థలు చాలాసార్లు ఉండవు. ఈ సమాచారం లేకపోవడం వల్ల ప్రయాణికులు తొందరపడి ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ జితేంద్ర జైన్ అన్ని సుదూర రైళ్లలో ప్రకటనలు తప్పని సరిగా ఉండాలన్నారు. ప్రయాణికులు కూడా కదులుతున్న రైలులో ఎక్కడం, దిగడం ఎప్పుడూ చేయకూడదన్నారు. అవసరమైతే జరిమానా చెల్లించి అయినా తర్వాతి స్టేషన్ వరకు వేచి ఉండడం మంచిదని అన్నారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, తొందరపాటు నిర్ణయాలు ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు.
Read Also: అక్కడి ప్రజలకు రైలు అంటే తెలియదు, కారణం ఏంటంటే?
బాంబే కోర్టు తీర్పు రైల్వే భద్రతలో ఒక కీలకమైన మార్పునకు దారితీసే అవకాశం ఉంది. సుదూర రైళ్లలో కూడా ప్రకటనలు ఉంటే, ప్రయాణికులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల బారినపడకుండా కాపాడుకుంటారు. ఇది ప్రయాణికుల భద్రతకు కీలకమైన స్టెప్ గా భావించవచ్చు.
Read Also: రైళ్ల తరహాలోనే విమానాల్లో పడుకొని ప్రయాణించవచ్చు.. ప్రయాణికులకు పండగే!