ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది విషయంలో కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. పైలెట్లతో పాటు విమాన సిబ్బంది యూనిఫామ్ లో ఉన్నప్పుడు బహిరంగంగా కాఫీ, టీ, సోడా సహా ఇతర డ్రింక్స్ తాగడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రూల్స్ ప్రకారం సిబ్బంది వాటర్ మినహా ఏ డ్రింక్స్ బహిరంగంగా తాగకూడదు. నీటిని కూడా పద్దతి ప్రకారం తీసుకోవాలి. కాఫీ, ఇతర డ్రింక్స్ ను సిబ్బందికి కేటాయించిన గదిలో లేదంటే కేఫ్టేరియాలలో మాత్రమే తీసుకోవాలి. బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ తన ఇమేజ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కొత్త నియమాలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. నెయిల్ పాలిష్, లిప్ స్టిక్, హెయిర్ స్టైల్స్, కళ్లద్దాల షేడ్స్ తో సహా సిబ్బందికి గ్రూమింగ్ ప్రమాణాలను పరిచయం చేసింది. ఈ మార్పులను విమానయాన సంస్థ సమర్థిస్తున్నప్పటికీ, అవి అంతర్గతంగా విమర్శలకు దారితీశాయి.
యూనిఫామ్ నిబంధనలతో పాటు, బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ సిబ్బంది, పైలట్లు సోషల్ మీడియాలో లే ఓవర్ హోటళ్ల ఫోటోలు, వీడియోలను షేర్ చేయడాన్ని నిషేధించింది. ఈ నిషేధం సిబ్బంది ప్రైవేట్ అకౌంట్స్ కూడా వర్తిస్తుందని వెల్లడించింది. కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే ఉన్న హోటల్ సంబంధిత కంటెంట్ ను తొలగించాల్సి ఉంటుందని వెల్లడించింది. భద్రతా కారణతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అధునాతన AI టూల్స్ హోటల్ స్థానాలను గుర్తించడానికి, ఫోటోల్లోని ఇతర వివరాలను విశ్లేషించే అవకాశం ఉంది. దీనివల్ల సిబ్బంది ప్రమాదంలో పడే అవకాశం ఉందని సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నిబంధనలను పాటించని ఉద్యోగులు క్రమశిక్షణా చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.
రీసెంట్ గా బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఉద్యోగులు, విమాన సిబ్బంది, పైలెట్లు డ్యూటీ సమయంలోనూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని సంస్థ గుర్తించింది. దీని వల్ల డ్యూటీ మీద శ్రద్ధ తగ్గడంతో పాటు సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఎదుటి వ్యక్తుల చేతులకు చిక్కు అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే, తమ సిబ్బంది సోషల్ మీడియాలో యూనిఫాంలో ఉన్న ఫోటోలు, కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా నిషేధించే విధానాన్ని విమానయాన సంస్థ అమలు చేసింది. విమానంలో తీసిన ఫోటోలు, చెక్ ఇన్ సమయంలో, విమానాశ్రయ టెర్మినల్ లో నడుస్తున్నప్పుడు తీసుకున్న ఫోటోలు లాంటి డ్యూటీలో ఉన్నప్పుడు తీసిన చిత్రాలను పంచుకున్నందుకు సిబ్బంది, ఉద్యోగులపై తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, విమానయాన సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సిబ్బంది అసంతృప్తి వ్యక్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో పోస్టుల గురించి మరోసారి ఆలోచించాలని సంస్థకు ఉద్యోగులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో విమానయాన సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. త్వరలోనే కొన్ని నిబంధనలను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఉద్యోగులు భావిస్తున్నట్లు సమాచారం.
Read Also: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!