Hand of the Desert: ప్రపంచంలో ఎన్నో వింతైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రకృతి అందాలతో ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మనుషులు సృష్టించిన కళాఖండాలతో ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వింతైన ప్రదేశమే చిలీలోని అటకామా ఎడారి. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుక, రాళ్లు, దూరంగా కనిపించే కొండలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ ప్రాంతంలో భూమిలో నుంచి ఓ భారీ చేయి బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ శిల్పాన్ని ‘మానో డెల్ డెసెర్టో’ (Mano del Desierto) లేదంటే ‘ఎడారి చేయి’ అని పిలుస్తారు. ఇది ఆంటోఫగాస్టా నగరానికి దక్షిణంగా సుమారు 75 కిలోమీటర్ల దూరంలో, పాన్ అమెరికన్ హైవే పక్కన ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇసుకలో కూరుకుపోయిన మనిషి చేయి పైకి వస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ భారీ కళాఖండాన్ని చిలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మారియో ఇరారాజబల్ రూపొందించారు. 1992లో దీనిని ఆవిష్కరించారు. రీ ఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్‌తో నిర్మించిన ఈ శిల్పం ఎడారి నేల నుంచి సుమారు 11 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని చుట్టూ ఎలాంటి పెద్ద భవనాలు, జనసంచారం ఉండవు. ఎటు చూసినా బీడు భూమి, ఇసుక దిబ్బలు, రాతి ప్రాంతాలు కనిపిస్తాయి. ఇలాంటి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా నిలిచిన ఈ చేయి మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఈ శిల్పం కేవలం పర్యాటకులను ఆకర్షించడానికి రూపొందించిన కళాఖండం మాత్రమే కాదు. దీని వెనుక ఓ లోతైన భావన ఉంది. కళాకారుడు మారియో ఇరారాజబల్ తన రచనల్లో, శిల్పాల్లో మానవ జీవితంలోని బలహీనతలు, ఒంటరితనం వంటి అంశాలను ప్రతిబింబించేవారు. అందుకే ఈ భారీ చేతిని మానవ నిస్సహాయతకు, ఒంటరితనానికి, ఇతరులతో అనుబంధం ఏర్పరచుకోవాలనే ఆకాంక్షకు ప్రతీకగా భావిస్తారు. ఎడారి కింద చిక్కుకున్న వ్యక్తి సహాయం కోసం చేయి చాచినట్లుగా కూడా కొందరికి కనిపిస్తుంది.
అటకామా ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. వృక్షసంపద కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి కఠినమైన వాతావరణంలో మనిషి చేయి ఆకారంలో ఉన్న ఈ భారీ నిర్మాణం ఉండటం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
ఇప్పుడు మానో డెల్ డెసెర్టో చిలీలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా మారింది. పాన్ అమెరికన్ హైవేపై ప్రయాణించే చాలామంది ఈ శిల్పం దగ్గర ఆగి ఫొటోలు తీసుకుంటారు.
Read Also: ఇక్కడ ఇళ్లన్నీ మట్టితోనే కట్టారు.. అయినా వందల ఏళ్లుగా చెక్కుచెదరలేదు!