Hyderabd Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తున్న నేపథ్యంలో నగరవాసులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. ప్రపంచంలోనే తొలి పీపీపీ మోడల్ మెట్రో తాజాగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రోజూకు సగటున 4.67 లక్షల మంది ప్రయాణిస్తుండగా, రద్దీ సమయాల్లో 5.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 7.43 లక్షల ట్రిప్ లు పూర్తి చేసిన హైద్రాబాద్ మెట్రో రైళ్లలో 63.5 కోట్ల మంది ప్రయాణించారు. ఫేజ్ 1లో 69 కిలో మీటర్ల మేర 57 స్టేషన్లతో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
రెండోదశ నిర్మాణానికి శరవేగంగా అడుగులు
తొలిదశ మెట్రోకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రెండోదశ నిర్మాణానికి హైద్రాబాద్ మెట్రో అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెట్రో రెండో దశ పార్ట్ Aలో భాగంగా 6 కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర మెట్రో రూట్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే 76.4 కిలో మీటర్ల మేర 5 ఫేజ్ లకు సంబంధించిన డీపీఆర్ సిస్ట్రా కన్సల్టేషన్ సైతం కంప్లీట్ అయ్యింది.
ఇందులో మియాపూర్ నుంచి పఠాన్ చెరు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు, LB నగర్ నుంచి హయత్ నగర్, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియో పోలీస్ వరకు విస్తరించనున్నారు. చాంద్రాయణగుట్ట మెట్రో జంక్షన్ గా అభివృద్ధి చేయనున్నారు. మెట్రో రెండో దశ పార్ట్ Bలో ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మాణం కొనసాగనుంది.
ఏ కారిడార్ లో ఎన్ని కిలో మీటర్ల నిర్మాణం?
మెట్రో రెండో దశ పార్ట్ Aలో భాగంగా 4వ కారిడార్ లో నాగోల్ నుండి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 36.8 కి.మీ మేర మెట్రో నిర్మాణం కొనసాగనుంది. ఈ రూట్ లో 24 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
5వ కారిడార్ లో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలీస్ వరకు 11.6 కిలో మీటర్ల నిర్మాణం కొనసాగనుండగా.. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి.
6వ కారిడార్ లో MGBS నుంచి చాంద్రాయణగుట్టట వరకు 7.5 కిలో మీటర్లు నిర్మించనున్నారు. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి. ఫలక్ నుమా నుంచి 2 కిలో మీటర్ల మేర పెంచి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించనున్నారు.
అటు 7వ కారిడార్ లో భాగంగా మియాపూర్ నుంచి పఠాన్ చెరు వరకు 13.4 కిలో మీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో మొత్తం 10 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్ లో డబుల్ డెక్కర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
8వ కారిడార్ లో భాగంగా LB నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ నిర్మాణం చేయనున్నారు. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి.
అటు ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో 9 మెట్రో స్టేషన్లు ఉంటాయి.
1.6 కిలో మీటర్ల మేర అండర్ గ్రౌండ్ నిర్మాణం
విమానాశ్రయం రూట్ లో 1.6కిలో మీటర్ల మేర అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టనున్నారు. మిగతా అంతా ఎలివెటేడ్ గా నిర్మించనున్నారు. ఇందులో సరాసరి మెట్రో రైలు స్పీడు గంటకు 35 కిలో మీటర్లు ఉంటుంది. ఈ రూట్లలో తొలుత 3 కార్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 6కు పెంచనున్నారు. మెట్రో స్టేషన్ల నిర్మాణం మాత్రం 6 కార్ ట్రైన్లకు అనుకూలంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మించే 5 కారిడార్లకు రూ.24,269 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి 2025 తొలివారంలో పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభంకానున్నాయి.
Read Also: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ కారిడార్‌లో రోజుకు ఏకంగా అంతమంది ప్రయాణిస్తున్నారట!