Chennai Metro Driverless Trains: దేశంలోనే అత్యాధునిక మెట్రో వ్యవస్థలలో ఒకటైన చెన్నై మెట్రో.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో డ్రైవర్ లెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కీలక ముందడుగు వేసింది. ఈమేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) ఆల్ స్టోమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియాతో రూ.1,540 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఏప్రిల్ 28 చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం నగరంలో ఫేజ్ 2 మెట్రో విస్తరణ కొనసాగుతోంది. ఈ ఫేజ్ లోనే ఆటోమేటెడ్, డ్రైవర్ లెస్ రైలు వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం.. అందుకు అనుగుణమైన రైళ్లను ఆల్ సోమ్ కంపెనీ అందించాల్సి ఉంటుంది.
మరింత కచ్చితత్వంతో రవాణా సేవలు
డ్రైవర్ లెస్ రైళ్లు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నెక్ట్స్ జెనరేషన్ రైళ్లు లోకో పైలెట్లు లేకుండా నడుస్తాయి. పూర్తిగా అత్యాధునిక ఆటోమేషన్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ ట్రైన్ సెట్లు ప్రయాణ ఫ్రీక్వెన్సీని మరింత మెరుగుపరుస్తాయి. ఎక్కువ విశ్వసనీయతను అందిస్తాయి. స్మార్ట్ సిస్టమ్‌లు, కచ్చితమైన నియంత్రణతో ప్రయాణీకుల భద్రతను మరింతగా మెరుగుపరిచే అవకాశం ఉంది. చెన్నై మెట్రోకు పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన రైళ్లను ఆల్‌స్టోమ్ సరఫరా చేయనుంది. ఈ సాంకేతికత గ్రేడ్ ఆఫ్ ఆటోమేషన్ 4 (GoA4) ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది తక్కువ మాన్యువల్ జోక్యంతో సజావుగా కార్యకలాపాలకు అనుమతిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ చెన్నై మెట్రోలో అద్భుతమైన ముందడుగుగా నిలువబోతోంది. ఇది పర్యవేక్షణ లేని రైలు వ్యవస్థలను నిర్వహించే ప్రపంచ స్థాయి నగరాల సరసన చెన్నైని నిలబెట్టబోతోంది.
చెన్నైలోని సెకెడ్ ఫేజ్ మెట్రో విస్తరణ గురించి..
చెన్నైలో ఫేజ్ 2 విస్తరణ దాదాపు 119 కి.మీ. విస్తరించి ఉంది. మాధవరం–SIPCOT, లైట్ హౌస్–పూనమల్లి, మాధవరం–షోలింగనల్లూర్ లాంటి కీలక కారిడార్లను కలుపుతుంది. ఈ ఫేస్ తో చెన్నైలోని అనేక నివాస, వాణిజ్య కేంద్రాలకు మెట్రో యాక్సెస్ ను లభించనుంది.
స్మార్ట్ మొబిలిటీలో అగ్రగామిగా..
ఇక డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లకు సంబంధించిన ఒప్పందం.. చెన్నై మెట్రో మౌలిక సదుపాయాల వృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఎలాంటి కాలుష్యం లేని సమర్థవంతమైన, సాంకేతికతతో నడిచే పట్టణ రవాణాకు ఉపయోగపడనుంది. భవిష్యత్ భారతీయ మెట్రో వ్యవస్థకు కీలక ముందుడుగు కాబోతోంది. ఈ కీలక మైల్ స్టోన్ చెన్నై స్మార్ట్ మొబిలిటీలో అగ్రగామిగా నిలుపబోతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత స్థిరమైన ప్రయాణాన్ని అందించనుంది. డ్రైవర్ లెస్ మెట్రో వ్యవస్థ చెన్నైలో సక్సెస్ అయితే, మిగతా నగరాలు కూడా ఈ దిశగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎలాంటి మానవతప్పిదాలకు ఆస్కారం లేకుండా ప్రజా రవాణాలో డ్రైవర్ లెస్ రైళ్లు కీలక భూమిక పోషిస్తే, భవిష్యత్ అంతా వీటికే మద్దతు పలికే అవకాశం ఉంటుంది.
Read Also: పని చేయని ఏసీలు, ఆరిపోయిన లైట్లు, ప్రయాణీకుల నరకయాతన!