China High Speed Trains: హైస్పీడ్ రైళ్ల తయారీలో చైనా చాలా ముందంజలో ఉంది. ప్రపంచంలోని మరే దేశానికి సాధ్యంకాని రీతిలో అత్యంత వేగంగా నడిచే హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దేశంలోని గంటకు 350 కిలో మీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ రైళ్లను తలదన్నే సరికొత్త రైళ్లను తయారు చేస్తున్నది. వ్యాక్యుమ్ ట్యూబ్ మాగ్లెవ్ రైళ్ల పేరుతో ఇవి రూపొందిస్తున్నది. ఏరోస్పేస్ టెక్నాలజీ, గ్రౌండ్ రైల్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీని కలిపి గంటకు 1,000 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లను రెడీ చేస్తున్నది. ప్రస్తుతం ప్రోటోటైప్ రైళ్లకు సంబంధించి హై-స్పీడ్ ప్రొపల్షన్ పరీక్షలను జరుపుతున్నది.
మాగ్నెటిక్ లెవిటేషన్ సాయంతో..
కొత్తతరం హై స్పీడ్ రైళ్లు మాగ్నెటిక్ లెవిటేషన్ సాయంతో వాక్యూమ్ ట్యూబ్ ల ద్వారా కమర్షియల్ ఫైట్స్ కంటే వేగంగా ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. ఈ హై స్పీడ్ రైళ్లలో 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకులు HD వీడియోలను చూడటంతో పాటు ఆన్ లైన్ గేమ్స్ ను ఆశ్వాదించే అవకాశం ఉంటుంది. అయితే, మొబైల్ ఫోన్లు, బేస్ స్టేషన్ల మధ్య హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను నిర్వహించడం అనేది సవాలుతో కూడుకున్న విషయం. ఎందుకంటే, రైలు పూర్తి స్థాయి వేగం అందుకున్నప్పుడు బేస్ స్టేషన్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు, అది రిసీవ్ చేసుకునే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. హై-స్పీడ్ డేటా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా స్థిరమైన హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. అంతేకాదు, వాక్యూమ్ ట్యూబ్ లలో బేస్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేయడం, మెయింటెన్స్ కూడా చాలా కష్టం అంటున్నారు నిపుణులు.
పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?
చైనా సౌత్ ఈస్ట్ యూనివర్సిటీలోని నేషనల్ కీ లాబొరేటరీ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ సాంగ్ టిచెంగ్ నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ ప్రాజెక్ట్ మీద పరిశోధన చేస్తోంది. వ్యాక్యూమ్ ట్యూబ్ లోపలి గోడపై రెండు సమాంతర కేబుళ్లను వేయడం వల్ల బేస్ స్టేషన్ ఇన్‌స్టాలేషన్ సమస్యను పరిష్కరించవచ్చని గుర్తించారు. ఈ స్పెషల్ కేబుల్స్ మాగ్నటిక్ సంకేతాలను విడుదల చేస్తాయన్నారు. అటు 5జీ నెట్ వర్క్ కోసం స్మార్ట్ ఫోన్లు, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య నిరంతర, స్థిరమైన కనెక్షన్లను కొనసాగేలా చూస్తాయన్నారు. “పక్కాకోడింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా, నిర్దిష్ట కీ సిగ్నల్ పరిమితులను సర్దుబాటు చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ మార్పులను అరికట్టే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సిములేషన్ సాయంతో 5G డేటా మార్పిడి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది” అని ప్రొఫెసర్ సాంగ్ తెలిపారు. అటు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లోని మాగ్నెటిక్ లెవిటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్ జనరల్ విభాగానికి చెందిన ఇంజనీర్లు వ్యాక్యుమ్ ట్యూబ్ మాగ్లెవ్ రైళ్ల పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా స్థావరం ఏర్పాటు
వ్యాక్యుమ్ ట్యూబ్ మాగ్లెవ్ రైళ్ల రూపకల్పన కోసం కార్పొరేషన్ డాటోంగ్, షాంగ్సీ ప్రావిన్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా స్థావరాన్ని నిర్మించింది. పూర్తి స్థాయి ప్రోటోటైప్ రైళ్లపై హై స్పీడ్ ప్రొపల్షన్ పరీక్షలను మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ మొత్తం 2 కిలోమీటర్ల పొడవులో ఉన్న వాక్యూమ్ ట్యూబ్ లో టెస్టింగ్ జరుగుతున్నది. మాగ్నటిక్ సస్పెన్షన్, బ్రేకులు, గరిష్ట వేగం సహా పలు అంశాను పరిశీలిస్తున్నారు. మరోవైపు పలు నగరాల్లో తొలి కమర్షియల్ వాక్యూమ్ ట్యూబ్ మాగ్లెవ్ లైన్లను నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే బీజింగ్, షాంఘై వరకు కేవలం 90 నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ మాగ్లెవ్ రైలును తొలుత ఏ నగరాల మధ్య అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.
ఇక 2023 చివరి నాటికి చైనాలో 159,000 కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. హైస్పీడ్ రైళ్లు 45,000 కిలో మీటర్లకు పైగా తమ సేవలను అందిస్తున్నాయి.
Read Also: రైలు బోగీల మీద కోడ్ నెంబర్లు, ఇంతకీ వాటి వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?