Indian Railways: తరచుగా రైలు ప్రయాణం చేసే వారికి వచ్చే డౌట్లలో ఒకటి కోచ్ ల మీద ఉండే కోడ్ నెంబర్స్. రైలులోని ప్రతి బోగీ మీద ఓ కోడ్ నెంబర్ ఉంటుంది. ఇంతకీ ఈ కోడ్ నెంబర్ వెనుక ఉన్న అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ కోడ్ నెంబర్ వెనుకున్న అసలు విషయాన్ని తెలుసుకుందాం..
ప్రతి రైలులో పెద్ద సంఖ్యలో బోగీలు ఉంటాయి. ఆయా రూట్లలో రద్దీని బట్టి అధికారులు రైళ్లకు బోగీల సంఖ్యను నిర్ణయిస్తారు. అయితే, రైలులోని ప్రతి బోగీ మీద 5 అంకెలతో కూడిన కోడ్ నెంబర్ ఉంటుంది. ఈ కోడ్ నెంబర్ వెనుకున్న అర్థం ఏంటో చాలా మందికి తెలియదు.
తొలి రెండు అంకెలు ఏం సూచిస్తాయంటే?
ప్రతి బోగీ మీద 5 అంకెలతో కూడిన కోడ్ నెంబర్ ఉండగా, అందులో తొలి రెండు నెంబర్లు బోగీ తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి. ఒకవేళ బోగీ కోడ్ నెంబర్ లో తొలి రెండు అక్షరాలు 98 అని ఉంటే ఆ బోగీ 1998లో తయారు చేశారని అర్థం చేసుకోవాలి. అదే 21 అని ఉంటే 2021లో తయారు చేశారని అర్థం. ఎందుకు ఈ కోడ్ నెంబర్ వేస్తారంటే.. ప్రతి బోగీకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉంటుంది. తయారీ సమయంలోనే ఈ బోగీని ఎంతకాలం ఉపయోగించాలనేది నిర్ణయిస్తారు. ఆ విషయం తెలిసేలా బోగీ మీద రాస్తారు.
చివరి మూడు అంకెల అర్థం ఏంటంటే?
రైలు బోగీ మీద ఉన్న తొలి రెండు అంకెలు తయారీ సంవత్సరాన్ని సూచిస్తే, తర్వాతి మూడు అంకెలు కోచ్ టైప్ ను వివరిస్తాయి. రైళ్లలో సాధారణంగా ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ కోడ్ నెంబర్ కూడా ఏ క్లాస్ కు చెందిన బోగీ అనే విషయాన్ని వివరిస్తాయి. చివరి మూడు అంకెల్లో 1 నుంచి 200 నెంబర్ ఉంటే అది ఏసీ క్లాస్ కోచ్ గా గుర్తించాలి. ఇక ఆ నెంబర్ 200 నుంచి 400 మధ్యలో ఉంటే అది స్లీపర్ క్లాస్ కోచ్ గా గుర్తించాలి. 400 నుంచి 600 మధ్యలో ఉంటే అది జనరల్ బోగీ అని అర్థం. ఒకవేళ మీరు చూసిన బోగీ మీద 337 అని రాసి ఉంటే, అది స్లీపర్ క్లాస్ బోగీగా గుర్తించాలి.
భారతీయ రైల్వే గురించి..
ఇక భారతీయ రైల్వే సంస్థ ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారత్ లో రోజూ రైలు ప్రయాణం ద్వారా 2 నుంచి 3 కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ధరకు మెరుగైన ప్రయాణాన్ని చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు.
Read Also: రూ.1.5 లక్షలు గెలుచుకొనే అవకాశం.. వెంటనే ఇలా చెయ్యండి!