Delhi Metro Train Features: మేకిన్ ఇండియాలో భాగంగా భారతీయ రైల్వే రోజు రోజుకు సరికొత్త హంగులు అద్దుకుంటుంది. తాజాగా ఈ పథకంలో భాగంగా అదిరిపోయే మెట్రో రైళ్లు రెడీ అయ్యాయి. త్రివర్ణ థీమ్ తో డ్రైవర్ లెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఢిల్లీ మెట్రో ఫేజ్-4లో సేవలు అందించనున్నాయి. ఈ మెట్రో రైళ్లు దేశభక్తిని ప్రతిబించించనున్నాయి. ఒక్కో రైలు 6 కోచ్ లతో నడుస్తుంది. మొదటి, రెండవ, మూడవ కోచ్ లు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. నాల్గవ, ఐదవ, ఆరవ కోచ్ లు మళ్లీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉంటాయి. మొత్తం రైలును త్రివర్ణ రంగులతో అలంకరించనున్నారు, ఇది ప్రయాణీకులలో దేశభక్తి స్ఫూర్తిని కలిగించనుంది. ప్రస్తుతం, ఫేజ్-4కు సంబంధించిన తొలి రైలు ఢిల్లీకి చేరుకుంది. దీని ట్రయల్ ముకుంద్ పూర్ డిపోలో జరుగుతోంది. త్వరలో ఈ రైలు మెట్రో కారిడార్ లో అందుబాటులోకి రానుంది.
ఫేజ్-4 కోసం 52 మెట్రో రైళ్ల కొనుగోలు
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఫేజ్-4 కోసం మొత్తం 52 రైళ్లను కొనుగోలు చేస్తోంది. వీటిలో 352 కోచ్‌లు ఉంటాయి. వీటిని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో తయారు చేస్తున్నారు. ఈ కొత్త రైళ్లు చాలా విషయాల్లో పాత మెట్రో రైళ్ల కంటే అత్యాధునికంగా ఉంటాయి. వీటి గరిష్ట వేగం గంటకు 95 కి.మీ ఉంటుంది. ఫేజ్-3 రైళ్లు గంటకు 80 కి.మీ వేగంతో మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్లు తక్కువ శబ్దం చేస్తాయి. ఈ కొత్త రైళ్లలోని సీట్లు రంగు రంగులగా ఉండవు. అన్ని కోచ్‌లలో ప్రయాణీకులకు మొబైల్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కోచ్ లన్నీ సీసీకెమెరా పర్యవేక్షణలో ఉంటాయి.
ఫేజ్-4లో మూడు కొత్త కారిడార్లు
ఫేజ్-4 కింద మూడు కొత్త కారిడార్లను నిర్మిస్తున్నారు. జనక్ పురి వెస్ట్-ఆర్‌కె ఆశ్రమ కారిడార్, మౌజ్ పూర్-మజ్లిస్ పార్క్ కారిడార్, గోల్డెన్ లైన్ (తుగ్లకాబాద్-ఏరోసిటీ) కారిడార్. పింక్ లైన్ పొడిగింపు అయిన మౌజ్ పూర్-మజ్లిస్ పార్క్ కారిడార్ పూర్తయింది. దాని ఐదు స్టేషన్లలో పూర్తి పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్ పై ట్రయల్ కూడా పూర్తయింది. మెట్రో కార్యకలాపాలు త్వరలో ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనక్‌పురి వెస్ట్ నుంచి కృష్ణ పార్క్ ఎక్స్ టెన్షన్ వరకు మెజెంటా లైన్ పొడిగింపు అయిన జనక్ పురి వెస్ట్- ఆర్‌కె ఆశ్రమ కారిడార్ లో మెట్రో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా పూర్తయింది. మెజెంటా లైన్ లో 24 కొత్త రైళ్లు (144 కోచ్‌లు), పింక్ లైన్ లో 15 రైళ్లు (90 కోచ్‌లు), గోల్డెన్ లైన్‌లో 13 రైళ్లు (78 కోచ్‌లు) నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు.
Read Also: వందే భారత్ స్లీపర్‌పై రైల్వే మంత్రి కీలక ప్రకటన.. వచ్చేది అప్పుడేనట!