Vande Bharat Sleeper Train: దేశంలో రైల్వే ప్రయాణాన్ని మరింత వేగంగా, ఆహ్లాదకరంగా మార్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రోజు రోజుకు మరింత అప్ గ్రేడ్ అవుతోంది. 8 కోచ్ లో ప్రారంభమైన ఈ రైలు ప్రయాణం నెమ్మదిగా 24 కోచ్ లకు పెరిగింది. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రైళ్లు దేశంలో రైలు ప్రయాణాన్ని మరింతగా మార్చనున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ రైళ్లు వేగం, సౌకర్యంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణీకులను తీసుకెళ్లనున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు
వందేభారత్ స్లీపర్ రైలు అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ రైళ్లు ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్తులు, విమానంలో మాదిరి డిజైన్, ఆన్-బోర్డ్ Wi-Fi లాంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త సెమీ-హై స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిశ్శబ్ద, సున్నితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చేదెప్పుడు?
ఈ ఏడాది ప్రారంభంలోనే వందేభారత్ స్లీపర్ రైలు పరీక్ష విజయవంతం అయ్యింది. చాలా మంది ఎప్పుడెప్పుడు ఈ రైలు అందుబాటులోకి వస్తుందా? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందేభారత్ స్లీపర్ రైళ్ల అరంగేట్రం గురించి కీలక విషయాలు వెల్డించారు. రాజ్యసభకు మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్ త్వరలో ప్రారంభించబడుతుందని చెప్పారు. “వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ తొలి మోడల్ ఇప్పటికే తయారు చేయబడింది. విస్తృతమైన ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా, వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది” అని మంత్రి వెల్లడించారు.
అటు భారతీయ రైల్వే తయారు చేయబోయే వందే భారత్ స్లీపర్ రైళ్ల రూపకల్పనను ఖరారు చేసినట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. “ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), చెన్నై ద్వారా మరో 50 వందే భారత్ స్లీపర్ రేక్ లను ఉత్పత్తి చేస్తున్నారు. అదనంగా, 200 వందే భారత్ స్లీపర్ రేక్‌లను తయారు చేసే ఒప్పందాన్ని కూడా టెక్ భాగస్వాములకు అప్పగించారు. వీటిలో M/s KINET రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ ఒక్కొక్కటి 16 కోచ్‌లతో 120 రైళ్లను సరఫరా చేయాల్సి ఉంది” అని వివరించారు.
తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది?
ఇక దేశంలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఫిబ్రవరి 15, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మొదటిసారిగా, ఇది సగటున గంటకు 100 కి.మీ వేగంతో నడిచింది. ఢిల్లీ- వారణాసి మధ్య కేవలం 8 గంటల్లో, ఢిల్లీ- ప్రయాగ్ రాజ్ మధ్య కేవలం 6.8 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేసింది.
Read Also: మీకు తెలుసా? రాత్రిళ్లు కూడా మెట్రో రైళ్లు నడుస్తాయి, కానీ జనాలతో కాదు.. ఎందుకంటే?