IRCTC Special Offer: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యాటకుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్పెషల్ టూర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. తక్కువ ధరలో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలను కవర్ చేసే నార్త్ ఈస్ట్ డిస్కవరీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పర్యటన 14 రాత్రులు, 15 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా ఈ నెల 22న ఢిల్లీలో మొదలుకానుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించలా ఈ టూర్ లో టికెట్ ధరలపై ఏకంగా 33 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
5 ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగనున్న టూర్
మొత్తం 15 రోజుల పాటు కొనసాగే ఈ టూర్ నార్త్ ఈస్ట్ లోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల ద్వారా కొనసాగనుంది. గౌహతి, ఇటానగర్, సిబ్ సాగర్, జోర్హాట్, కాజిరంగ, ఉనకోటి, అగర్తాల, ఉదయపూర్, దిమాపూర్, కోహిమా, షిల్లాంగ్, చిరపుంజి లాంటి నగరాలు ఈ టూర్ లో కవర్ అవుతాయి. ఈ రైలు ఈ నెల 22న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ (DSJ) నుంచి ప్రారంభంకానుంది. తర్వాత గౌహతి, నహర్ లగున్, సిబ్ సాగర్ టౌన్, ఫుర్ కేటింగ్, కుమార్ ఘాట్, అగర్తాల, దిమాపూర్ వరకు వెళ్లి, తిరుగు ప్రయాణం అవుతుంది.
బోర్డింగ్ స్టేషన్లు ఇవే!
నార్త్ ఈస్ట్ డిస్కవరీ యాత్ర ఢిల్లీ సఫ్దర్ జంగ్ నుంచి ప్రారంభం అవుతుంది. ఘజియాబాద్, అలీఘర్, తుండ్ల, కాన్పూర్, లక్నోలో రైలును ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రైలులో మొత్తం 150 సీట్లు ఉంటాయి, వీటిని సుపీరియర్ AC I (కూపే) – 20, సుపీరియర్ AC I (క్యాబిన్) – 38, డీలక్స్ AC II-టైర్ – 36, కంఫర్ట్ AC III-టైర్ – 56గా విభజించారు.
టిక్కెట్ ధరలు ఎలా ఉంటాయంటే?
నార్త్ ఈస్ట్ డిస్కవరీ టూర్ ధరలు రూ. 1,13,700 నుంచి ప్రారంభమై రూ. 1,72,295 వరకు ఉంటాయని IRCTC తెలిపింది.
Read Also: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?
ఏ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందంటే?
ఈ పర్యాటనలో భాగంగా అస్సాంలోని పురాతన శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించవచ్చు. బ్రహ్మపుత్ర నదిపై సూర్యాస్తమయ విహారం, గౌహతిలోని ఉమానంద ఆలయం, జోర్హాట్ లోని టీ ఎస్టేట్లు, కాజిరంగ సఫారీని చూడవచ్చు. ఇటానగర్ లో గొంప బౌద్ధ దేవాలయం, థెరవాడ బౌద్ధ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. త్రిపురలోని రాతి శిల్పాలు, కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందిన శైవ స్థలమైన ఉనకోటికి, ఉజ్జయంత రాజభవనం, త్రిపుర సుందరి ఆలయం చూడవచ్చు. నాగాలాండ్ రాజధానిలోని ఖోనోమా గ్రామాన్ని సందర్శించవచ్చు. చిరపుంజి – షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ జలపాతం, నవ్ఖలికై జలపాతంను చూడవచ్చు.
Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!