Rohtang Pass Tour: ఎండలు ముదురుతున్నాయి. వేసవి సెలవులు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వేసవి తాపం నుంచి బయటపడేందుకు, చల్లటి ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ రోహ్ తంగ్ పాస్. మండు వేసవిలో స్నోబాల్ గేమ్స్ థ్రిల్, చల్లని పర్వత గాలుల్లో హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. రోహ్ తంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. మనాలి నుంచి కేవలం 51 కి.మీ దూరంలో ఉంటుంది. 13,058 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదో అద్భుతమైన ప్రయాణ అనుభావాన్ని అందిస్తుంది. వేసవిలో మంచు కురుస్తూ పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది.
రోహ్ తంగ్ పాస్ కు ఎప్పుడు వెళ్లాలి?
రోహ్ తంగ్ పాస్ సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు అందుబాటులో ఉంటుంది. ఇది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మంచు తొలగింపు ప్రక్రియ చేపట్టేదాన్ని బట్టి ఈ టూర్ ఎన్ని రోజులు అనేది నిర్ణయించబడుతుంది. ఈ ప్లేస్ ను సందర్శించడానికి బెస్ట్ టైమ్ మాత్రం మే రెండో వారం నుంచి జూన్ తొలి వారం. ఈ సమయంలో మంచు కురుస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అంతా మంచు దుప్పటి కప్పుకుని కనువిందు చేస్తుంది. జూన్ చివరి నాటికి మంచు తగ్గడం ప్రారంభమవుతుంది. రాతి కొండలపై పచ్చిక బయళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. వేసవి ప్రారంభంలో సందర్శకులు నీలి ఆకాశం కింద శీతాకాలం అనుభవాన్ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు. మంచుపై జారడంతో పాటు స్లెడ్జ్ చేయవచ్చు.
రోహ్ తంగ్ పాస్ కు ఎలా వెళ్లాలంటే?
ఒకవేళ మీకూ రోహ్ తంగ్ పాస్ కు వెళ్లాలని ఉంటే, హిమాచల్ ప్రదేశ్ లోని హిల్ స్టేషన్ మనాలి నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి మనాలికి 50 కిలో మీటర్ల దూరంలోని భుంటార్(కులు)లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి మనాలికి తీసుకెళ్లడానికి ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకుంటే.. ఢిల్లీ, చండీ గఢ్ నుంచి మనాలికి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.
మనాలి నుంచి రోహ్ తంగ్ పాస్ కు సుమారు 2 నుంచి 3 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్లేందుకు వాహనాలకు పర్మిట్ తప్పనిసరి. దీనిని rohtangpermits.nic.inలో ఆన్ లైన్ ద్వారా లేదంటే మనాలిలోని టూర్ ఆపరేటర్స్ అదీ కాదంటే హోటల్స్ లోనే పొందవచ్చు. రోజువారీ వాహన పరిమితులు కచ్చితంగా అమలు చేయబడతాయి. టూర్ కు ముందుగా పక్కగా ప్లాన్ చేసుకోవడం మంచిది.
రోహ్ తంగ్ పాస్ లో చూడాల్సిన ప్రదేశాలు
రోహ్ తంగ్ పాస్ లో ఎటు చూసినా మంచు కురుస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లిన వాళ్లు వేసవి మంటల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఉత్కంఠభరితమైన దృశ్యాలు, సుందరమైన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. పిర్ పంజాల్ పర్వత శ్రేణి, హిమానీనదాలతో నిండిన ప్రవాహాలు, లాహౌల్ స్పిటి ప్రాంతం కనువిందు చేస్తుంది. ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే వెంటనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే.. అక్కడికి వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్స్? తక్కువ ఖర్చులో బెస్ట్ 7 కంట్రీస్ ఇవే!