Viral News: పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. ఒకసారి మూడు ముళ్ల బంధంతో వివాహ జీవితంలోకి అడుగు పెడితే జీవితాంతం ఆ దాంపత్యం కొనసాగేది. కానీ, ఈ రోజుల్లో పెళ్లి అనే మాటకు అర్థం మార్చేశారు. కష్టాలు కన్నీళ్లు అంటూ జీవితాంతం ఒకే భాగస్వామితో ఉండాలంటే మా వల్ల కాదు అంటున్నారు నేటి యువత. పెళ్లికంటే సహజీవనం బెస్ట్ అంటున్నారు మరికొంత మంది. నచ్చినన్ని రోజులు కలిసి ఉంటాం. నచ్చకపోతే విడిపోతాం అనే స్థాయికి చేరారు. ఈ నేపథ్యంలో చైనాలో మరో కొత్త రకం వివాహ పద్దతి అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ‘ఫ్రెండ్షిప్ పెళ్లి’. ఇంతకీ ఈ పెళ్లి కథ ఏంటంటే..
ఓన్లీ పెళ్లి.. నో రొమాన్స్!
చైనాలో గత కొంతకాలంగా కొత్త తరహా పెళ్లిళ్లు ఎక్కువ అయ్యాయి. సంప్రదాయ పెళ్లిళ్లను కాదని, ‘ఫ్రెండ్షిప్ పెళ్లి’ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ వివాహం సంప్రదాయ వివాహానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. సాధారణంగా పెళ్లి చేసుకున్నాక ముద్దూ, ముచ్చట, పిల్లా పాపలు అంటూ ఎన్నెన్నో ఉంటాయి. కానీ, ‘ఫ్రెండ్షిప్ పెళ్లి’లో అవన్నీ ఉండవు. ఓన్లీ మ్యారేజ్.. నో రొమాన్స్ అన్నట్లు. ఈ రకం పెళ్లి చేసుకున్న వాళ్లు చట్టబద్ధంగా దంపతులు అయినప్పటికీ, ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. అయితే, ఇంట్లో ప్రత్యేక బెడ్ రూమ్ ను కలిగి ఉంటారు. ఒకవేళ వాళ్లు పిల్లలు కావాలి అనుకుంటే దత్తత తీసుకోవడం లేదంటే కృత్రిమ గర్భధారణ ద్వారా సాధ్యం చేసుకవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ జంట ఇతర వ్యక్తులతో డేటింగ్ కూడా చేసుకోవచ్చు.
జపాన్ లో మొదలు..
‘ఫ్రెండ్షిప్ పెళ్లి’ అనే కాన్సెప్ట్ మొదట జపాన్ లో మొదలయ్యింది. ఇక్కడ చాలా మంది సంప్రదాయ వివాహాలకు విరుద్ధంగా ‘ఫ్రెండ్షిప్ పెళ్లి’కి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. ఈ వివాహాలను సెట్ చేసేందుకు ఏకంగా మ్యాచ్ మేకింగ్ సంస్థలు అనేకం ఉన్నాయి. సాంప్రదాయ వివాహం నచ్చని వాళ్లు, స్వలింగ సంపర్కులు, రొమాన్స్ ను ఇష్టపడని వాళ్లు ఈ రకమైన వివాహాల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఇప్పుడు చైనాకు పాకింది.
తాజాగా ఈ పెళ్లిళ్లకు సంబంధించి సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఓ వార్తను ప్రచురించింది. రీసెంట్ గా చైనాలోని చాంగ్ కింగ్ కు చెందిన మొయిలాన్ అనే యువతి, నాలుగు ఏళ్ల క్రితం తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఇద్దరూ ఒప్పంద పత్రం మీద సంతకాలు చేశారు. ఇందులో ఇంటి ఖర్చులను పంచుకోవడం, ప్రత్యేక ఆస్తి హక్కు, వారి బంధువులు ఇంటికి రావడం లాంటి అనేక విషయాలు ఉన్నాయి. అంతే కాదు, ఈ ఒప్పందంలో విడాకులు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీరిలో ఎవరైనా సంప్రదాయ పెళ్లి చేసుకోవాలనుకుంటే విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ నయా పెళ్లి తంతుపై సోషల్ మీడియాలో సటైర్లు వేసుకుంటున్నారు. ‘అది’ లేకుండా ఇదేం పెళ్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: ఓర్నీ.. ఏకంగా AIతో బేరం ఆడించి.. ఆటో ఎక్కేశాడు, ఇక భాషతో సమస్యే లేదు!