Stepwells: తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ తన చారిత్రక వారసత్వంతో పాటు అనేక పురాతన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఆ నిర్మాణాలలో ఒకటైన మెట్లబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్ లోని మెట్లబావులు చారిత్రక, సాంస్కృతిక, నీటి నిర్వహణ వ్యవస్థలకు ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పొచ్చు. వీటిని కేవలం నీటి నిల్వ కోసం మాత్రమే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారని స్థానికులు చెప్పుకుంటారు.
హైదరాబాద్‌లోని మెట్లబావులు ఎక్కువగా కుతుబ్ షాహీ, నిజాం కాలంలో నిర్మించారు. వీటిలో కొన్ని బావులు అప్పటి రాజులు, రాణులు లేదా ఉన్నత వర్గాలకు చెందినవారు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని సంరక్షించి, వేసవి కాలంలో నీటి అవసరాలను తీర్చడం వంటి సామాజిక సేవలకోసం నిర్మించారు. వీటి నిర్మాణ శైలి అప్పటి కాలానికి సంబంధించిన కళాత్మకత, ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ మెట్లబావులలో ఒకటి బంసీలాల్‌పేట్ స్టెప్‌వెల్. దీనిని 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ బావిలోని సుందరమైన రాతి మెట్లు, చుట్టూ ఉన్న చిన్న చిన్న గదులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఒకప్పుడు స్థానికులకు నీటి అవసరాలకు ఉపయోగపడిన ఈ బావిని కుతుబ్ షాహీ శైలిలో నిర్మించారు. దీనితో పాటుగా మహేశ్వరం స్టెప్‌వెల్ కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మెట్ల బావులు సాధారణంగా రాతితో లోతుగా నిర్మించి ఆ లోతును చేరుకోవడానికి మెట్లను కలిగి ఉంటాయి కాబట్టి వీటికి మెట్ల బావులు అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్పుకుంటారు.
మహిళలు నీటిని తీసుకోవడానికి వచ్చి ఇక్కడ సామాజిక సమావేశాలు, మతపరమైన ఆచారాలు జరిపేవారు కాబట్టి ఈ మెట్లబావులు సామాజిక కేంద్రాలుగా కూడా పనిచేసాయి. అయితే, ఆధునిక కాలంలో నిర్వహణ లోపం, నగరీకరణ వల్ల కొన్ని బావులు పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల, పురాతన నిర్మాణాల సంరక్షణ కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కొన్ని బావులను పునరుద్ధరించే ప్రయత్నాలు చేపడుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఫలించినట్లైతే మెట్ల బావులకు తిరిగి పూర్వ వైభవం వస్తుంది.
ఈ బావులు హైదరాబాద్ కి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని, ఆనాటి నీటి నిర్వహణ వ్యవస్థను యంగ్ జనరేషన్ పిల్లలకు తెలియజేస్తాయి. వీటిని సందర్శించడం వల్ల ఇప్పటి పిల్లలు, పెద్దలు ఒకప్పటి హైదరాబాద్ చారిత్రక గొప్పతనాన్ని గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.