Dudhsagar Waterfalls: చుట్టూ ఎత్తైన కొండలు.. కొండల మీద పచ్చటి చెట్లు వాటి మధ్యలో పాలలాగా ఉండే తెల్లటి నీళ్లు.. ఆ కొండల మధ్య నుంచి ఓ అందమైన వంతెన.. దాని మీద అప్పుడప్పుడు వేళ్లే రైళ్లు. ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా. అదే నిజంగా ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే ఆ అనుభూతే వేరు..! ఇంత అందంగా ఉండే ఆ ప్రదేశం మరేదో కాదు. గోవా, కర్ణాటక బార్డర్‌లో ఉండే దూద్‌సాగర్.
వాటర్ ఫాల్స్‌ని ఎక్కువడా ఇష్టపడే ప్రకృతి ప్రేమికులకు దూద్‌సాగర్ జలపాతం చాలా నచ్చుతుంది. గోవా, కర్ణాటక మధ్య సరిహద్దులో దూద్‌సాగర్ జలపాతాలు కనిపిస్తాయి. ఇండియాలో అందమైన, ఫేమస్ జలపాతాలలో దూద్‌సాగర్ ఒకటి. ఇది 310 మీటర్ల ఎత్తు నుండి లోతైన గార్జ్‌లోకి ప్రవహిస్తుంది. పాల లాగా తెల్లగా ఉండే నీళ్ల ప్రవాహం చూడడానికి రెండు కళ్లు సరిపోవు.
ఎలా వెళ్లాలి..?
దూద్‌సాగర్ జలపాతానికి వెళ్లాలంటే కర్ణాటక, లేదా గోవా వెళ్లాలి. కర్ణాటక నుంచి వెళ్తేకాసిల్‌రాక్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. జలపాతం నుండి 10 కి.మీ దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. గోవా నుంచి వెళ్లాలంటే కులేం స్టేషన్‌కు చేరుకోవచ్చు.
కులెం నుండి దూద్‌సాగర్ జలపాతం వరకు ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ దాదాపు 10-12 కిమీ ఒక ఉంటుంది. దీనికి 3-4 గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవి, రైల్వే ట్రాక్‌లు, పాల లాంటి ప్రవాహాల గుండా ఇది చాలా ఎగ్జైంటింగ్‌గా ఉంటుంది.
ట్రెక్కింగ్ చేయకూడదనుకుంటే, కులెం లేదా మోల్లెం నుండి జలపాతం బేస్ వరకు జీప్ సఫారీలో వెళ్లొచ్చు. జీప్ జలపాతానికి సమీపంలో ఉన్న వ్యూ పాయింట్‌కి తీసుకువెళుతుంది. జలపాతం దగ్గరికి చేరుకున్న తర్వాత, అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరొచ్చు.
ALSO READ: సమ్మర్‌లో కూల్ కూల్ ప్లేసెస్
కాస్త అడ్వెంచర్‌ను ఇష్టపడే వారు అయితే జలపాతం కింద ఉన్న కొలనులో స్నానం కూడా చేయవచ్చు. అయితే ఈత కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జలపాతం దగ్గర ఈత కొట్టాలని అనుకుంటే, ప్రవాహాలు బలంగా ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ స్థానిక భద్రతా మార్గదర్శకాలను ఫాలో కావాలి. సౌకర్యవంతమైన ట్రెక్కింగ్ బూట్లు, తేలికపాటి దుస్తులు వేసుకోవాలి.
దూద్‌సాగర్ మాత్రమే కాకుండా అక్కడికి వెళ్తే గోవాలో మరొక వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించొచ్చు. పులులు, చిరుతపులులు వివిధ జాతుల పక్షులు కూడా ఇక్కడ ఉంటాయి.