చల్లని హిల్ స్టేషన్లకు వెళ్లడానికి ఎంతోమంది ఇష్టపడతారు. అయితే కేవలం హిల్ స్టేషన్లే కాదు ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చిన్నప్పటినుంచి ప్రతి ఒక్కరు ఎన్నో అద్భుతమైన కథలు వింటూ పెరిగే ఉంటారు. అందులో ఎగిరే దేవకన్యలు, మెరిసే రాజభవనాలు, నేలపై దిగిన మేఘాలు… ఇలా ఎన్నో వినే ఉంటారు. అలాంటి ప్రదేశాన్ని ఫెయిరీ ల్యాండ్ అని పిలుచుకుంటారు. స్వర్గం లాంటి ఫెయిరీ ల్యాండ్ కేవలం కథలోనే ఉంటుందని అనుకోకండి. మనదేశంలో ఫెయిరీ ల్యాండ్ అనే ప్రదేశం ఉంది. దీన్ని యక్షిణుల భూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడకి వెళితే మీకు తిరిగి రావాలనిపించదు. నిజంగా స్వర్గంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది.
ఉత్తరాఖండ్ లోని అందమైన ప్రాంతం
ఉత్తరాఖండ్లోని అందమైన ప్రాంతం ఈ ఫెయిరీ ల్యాండ్. ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని చూస్తే నిజంగా అద్భుత కథల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే అనిపిస్తుంది. ఇక్కడ లోయలు, మేఘాలతో కప్పిన పర్వతాలు, ప్రశాంతమైన పచ్చదనం వంటివి మాయాజాలంలా అనిపించడం ఖాయం. అద్భుత కథల్లోని అందమైన ప్రదేశాన్ని చూడాలనిపిస్తే భారతదేశంలోని ఈ ఫెయిరీ ల్యాండ్ కు వెళ్లండి.
ఖైత్ పర్వతంపై
హిల్ స్టేషన్లు అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ఉత్తరాఖండ్. ఎన్నో అందమైన ప్రదేశాలకు ఇదే కేరాఫ్ అడ్రస్. ఉత్తరాఖండ్లోని చిన్న జిల్లా గర్హ్యాల్. ఇక్కడే ఉంది ఖైత్ పర్వతం. దీన్నే దేవకన్యలు నివసించే ప్రదేశంగా చెప్పుకుంటారు. చుట్టూ పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వాల్నట్స్, వెల్లుల్లి విపరీతంగా పండిస్తారు. ఈ ప్రదేశంలో మీరు క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దేవకన్యలు వచ్చిపోతూ ఉంటారని చెప్పుకుంటారు. అందుకే ఎలాంటి శబ్దాలు చేయకూడదు. డీజేలు పెట్టి పాటలు వినకూడదు. ఎందుకంటే దేవకన్యలు పెద్ద శబ్దాన్ని ఇష్టపడరు.
దేవకన్యల ఆలయం
ఈ ప్రాంతాన్ని దేవకన్యలే రక్షిస్తారని చెప్పుకుంటారు. అందుకే దేవకన్యల కోసం ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ దేవకన్యాలని పూజించే ఆచారం ఉంది. మీరు ఈ దేవకన్యల భూమికి వెళ్లాలనుకుంటే ఎక్కువగా ఖర్చు కూడా కాదు. మీ బడ్జెట్ లోనే ఈ దేవకన్యల భూమిని చేసి చూసి రావచ్చు.
ఉత్తరాఖండ్లోని ఈ యక్షిణుల భూమికి వెళ్లడానికి ముందుగా మీరు రిషికేష్ చేరుకోవాలి. అక్కడ నుంచి గర్హ్యాల్ జిల్లాకి వెళ్ళాలి. ఆ జిల్లాల్లో ఫెగులిపట్టి అనే గ్రామం ఉంది. అక్కడికి ప్రైవేట్ వాహనాలలో వెళ్లాల్సి వస్తుంది. అక్కడ నుంచి మీరు నడిచి ఖైత్ పర్వతాన్ని చేరుకోవచ్చు. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఖైత్ పర్వతం అక్కడికి వెళ్ళగానే మీకు నిజంగానే దేవకన్యల గ్రామంలోకి అడుగుపెట్టినట్టే అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్లి చూడండి. తిరిగి రావాలనిపించదు. అంత ప్రశాంతంగా అంత హాయిగా ఉంటుంది.