First Bus After 79 Years: రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామంలోకి తొలిసారి ప్రభుత్వ బస్సు రావడం గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 79 ఏళ్ల తర్వాత తమ గ్రామంలోకి రాజస్థాన్ రోడ్ వేస్ బస్సు అడుగుపెట్టడంతో కుర్థాల్ గ్రామస్థులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. బస్సుకు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బస్సు గ్రామంలోకి వస్తున్న సమయంలో వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పూలతో బస్సును అలంకరించి, పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు ఇచ్చారు. డప్పు దరువులతో కొందరు యువకులు డ్యాన్సులు చేశారు. పటాకులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్ ను కూడా గ్రామస్థులు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి తలపాగాలు పెట్టి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది.
కేక్రి ప్రాంతంలో ఉన్న కుర్థాల్ తో పాటు సమీపంలోని కెరోట్ గ్రామాలు కూడా చాలా కాలంగా రాజస్థాన్ రోడ్ వేస్ నెట్ వర్క్ కు దూరంగా ఉన్నాయి. గ్రామానికి నేరుగా ప్రభుత్వ బస్సు సర్వీసు లేకపోవడంతో స్థానికులు రవాణా కోసం ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. ప్రజా రవాణా అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, వైద్య అవసరాల కోసం వెళ్లే వారికి ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు రోడ్‌వేస్ బస్సు సర్వీసు ప్రారంభం కావడంతో సమీప పట్టణాలకు వెళ్లడం సులభం కానుంది. మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
पहली बार रोडवेज की बस गाँव में आई तो गांव वालों की खुशी का ठिकाना नहीं रहा.गांव में बस के प्रवेश करने पर ग्रामीणों ने फूल बरसाए, बस की आरती उतारी, पटाखे फोड़े और चालक-परिचालक का साफा व माला पहनाकर सम्मान किया.
राजस्थान के केकड़ी जिले में स्थित केरोट और कूरथल गांव में उत्सव का… pic.twitter.com/Azwz4CVbhw— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 6, 2026
బస్సుకు గ్రామస్థులు ఇచ్చిన స్వాగతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు రోడ్లపై నిలబడి బస్సు కోసం ఎదురుచూడటం, అది గ్రామంలోకి ప్రవేశించగానే పూలు చల్లడం వంటి దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. చాలామంది ఈ ఘటనను చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రభుత్వ బస్సు సేవ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని పలువురు కామెంట్లు చేశారు. ఈ సేవను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 79 ఏళ్ల తర్వాత గ్రామంలోకి వచ్చిన ఈ తొలి ప్రభుత్వ బస్సు.. కుర్థాల్ ప్రజలకు కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే కాదు, మెరుగైన కనెక్టివిటీపై కొత్త ఆశలను పెంచింది.
Read Also: కేరళ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!