Onam Special Trains 2026: ఓనం పండుగ సందర్భంగా కేరళకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 112 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది.
ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 6 వరకు వివిధ తేదీల్లో నడుస్తాయి. ఓనం పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లే కేరళ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే పర్యాటకుల ప్రయాణాన్ని మరింత ఈజీగా మార్చేందుకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 112 ప్రత్యేక ట్రిప్పుల్లో దక్షిణ రైల్వే 54 సర్వీసులను నిర్వహించనుండగా, మిగిలిన 58 సర్వీసులను ఇతర జోనల్ రైల్వేలు నిర్వహిస్తాయి. దక్షిణ రైల్వే పరిధిలోనే 38 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కేరళను ఇతర రైల్వే జోన్‌లతో లింక్ చేసే 16 ప్రత్యేక సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక నైరుతి రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సహా ఇతర రైల్వేలు కలిసి కేరళకు వచ్చే, కేరళ నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం మరో 58 ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కేరళకు ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై, బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి, హైదరాబాద్, శాంత్రగాచి లాంటి ప్రధాన నగరాలను కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, కన్నూర్, మంగళూరు లాంటి ముఖ్యమైన ప్రాంతాలను కలపనున్నాయి. ఉద్యోగాలు, చదువుల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేరళవాసులు సులభంగా తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
గత ఏడాది ఓనం సందర్భంగా భారతీయ రైల్వే 55 ప్రత్యేక ట్రిప్పులు మాత్రమే నడిపింది. అయితే ఈసారి ఆ సంఖ్యను 112కు పెంచింది. అంటే గత ఏడాదితో పోలిస్తే సుమారు 103 శాతం పెంచింది. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది.
రైల్వే అధికారులు ప్రస్తుతం అన్ని ప్రధాన మార్గాల్లో వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటే అక్కడ అదనపు రైళ్లను కూడా నడిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని ప్రత్యేక సర్వీసులను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. పండుగ సమయాల్లో సాధారణంగా రైళ్లలో భారీ రద్దీ ఉంటుంది. టిక్కెట్లు దొరకక ఇబ్బందులు పడే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడమే కాకుండా, వెయిటింగ్ లిస్ట్ ను నియంత్రించడం, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు రైల్వే తెలిపింది. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
Read Also: కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!