Train Brake Failure: రైలు ప్రయాణం సురక్షితమైన ప్రయాణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే, వేగంగా వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? రైలును ఆపడం సాధ్యమేనా? ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు లోకో పైలట్, రైల్వే సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. నిజానికి, భారతీయ రైల్వేలో రైళ్ల భద్రత కోసం ఆధునిక ఎయిర్ బ్రేక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇది ఫెయిల్ సేఫ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఒకవేళ బ్రేకింగ్ వ్యవస్థలో సమస్య ఎదురైనా రైలును అదుపులోకి తీసుకురావడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ రైళ్లలో ప్రధానంగా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో ఎయిర్ ప్రెజర్ సాయంతో బ్రేకులు పనిచేస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఎయిర్ ప్రెజర్ కారణంగా బ్రేకులు పడతాయి. ఒకవేళ బ్రేక్ పైపులు దెబ్బతిన్నా, ఎయిర్ ప్రెజర్ అకస్మాత్తుగా తగ్గినా బ్రేకులు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. దీంతో రైలు వేగం తగ్గి ఆగిపోతుంది. ఈ వ్యవస్థనే ఫెయిల్ సేఫ్ మెకానిజం అంటారు.
రైలును వెంటనే ఆపాల్సిన పరిస్థితి వస్తే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగిస్తారు. అలాగే, రైలు చివరి బోగీలో ఉండే ట్రైన్ మేనేజర్ (గార్డ్) దగ్గర కూడా ఎమర్జెన్సీ బ్రేక్ వాల్వ్ ఉంటుంది. దీని ద్వారా బ్రేక్ పైపులో గాలి ఒత్తిడిని తగ్గించి రైలును ఆపే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అలారం చైన్ కూడా ఇదే విధంగా బ్రేకింగ్ వ్యవస్థలో ఎయిర్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. దీంతో రైలు ఆగిపోతుంది.
కొన్ని ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లలో డైనమిక్ బ్రేకింగ్ సదుపాయం ఉంటుంది. ఈ విధానంలో ట్రాక్షన్ మోటార్లను జనరేటర్లుగా పనిచేయించేలా మారుస్తారు. దీంతో రైలు కదలిక వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి వేగాన్ని తగ్గిస్తారు. కొన్ని రైళ్లలో రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా ఈ విద్యుత్‌ను తిరిగి వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
అన్ని సాధారణ బ్రేకింగ్ పద్ధతులు విఫలమై, రైలు అదుపు తప్పే ప్రమాదం ఉంటే రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిస్తారు. పరిస్థితిని బట్టి ఇతర రైళ్ల రాకపోకలను నిలిపివేసి, అందుబాటులో ఉన్న ప్రత్యేక ట్రాక్‌లను ఉపయోగిస్తారు. క్యాచ్ సైడింగ్ లేదంటే శాండ్ హంప్ లాంటి ఏర్పాట్లు అదుపు తప్పిన రైలును ఆపడానికి ఉపయోగపడతాయి. ఎత్తుగా ఉండే ట్రాక్‌పైకి రైలు వెళ్లడం వల్ల దాని వేగం తగ్గుతుంది. శాండ్ హంప్‌లోని ఇసుక కూడా రైలు వేగాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా తక్కువ వేగంతో కదులుతున్న రైలును ఆపేందుకు బ్రేక్ స్కిడ్స్ ఉపయోగించవచ్చు. ఇవి వీల్స్ కదలకుండా చేస్తాయి. అయితే, వీటిని సాధారణంగా రైలు ఆపడానికి ఉపయోగించే కీలక పద్ధతిగా పరిగణించరు. నిజానికి రైలులో బ్రేకులు పనిచేయకపోవడం చాలా అరుదైన ఘటన. అయినప్పటికీ, ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వేలో పలు భద్రతా వ్యవస్థలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. వీటి ఉద్దేశం రైలును సేఫ్ గా ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే.
Read Also: బంధువులకు సెండాఫ్ ఇచ్చేందుకు వందేభారత్ ఎక్కారు.. షాకింగ్.. రూ.30 వేల జరిమానా కట్టారు!