Beautiful Night Destinations: టూరిజం అనగానే చాలామందికి అందమైన కొండలు, పచ్చని అడవులు, అద్భుతమైన సముద్ర తీరాలు ఠక్కున గుర్తొస్తాయి. కానీ, దేశంలో కొన్ని ప్రదేశాల అసలైన అందాలు సూర్యాస్తమయం తర్వాతే కనిపిస్తుంది. వెన్నెల వెలుగులో మెరిసే తెల్లటి ఎడారి, నక్షత్రాల కింద ఇసుక దిబ్బలు, రాత్రి విద్యుత్ దీపాల కాంతిలో మెరిసే సరస్సులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. అలాంటి అద్భుతమైన టూరిజం స్పాట్స్ గురించి తెలుసుకుందాం.
గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. పగటిపూట తెల్లటి ఉప్పు మైదానంలా కనిపించే ఈ ప్రాంతం, పౌర్ణమి రాత్రుల్లో అద్భుతంగా మెరిసిపోతుంది. చంద్రుడి వెన్నెల తెల్లటి ఉప్పు నేలపై పడటంతో చుట్టూ వెండి రంగు పరుచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్గనైజ్ చేసే స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను గోల్డెన్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడి సమ్ సాండ్ డ్యూన్స్ రాత్రిపూట పర్యాటకులకు మరింతగా ఆకట్టుకుంటాయి. పగటిపూట వేడిగా ఉండే ఇసుక దిబ్బలు, రాత్రి చల్లని గాలులతో ఆహ్లాదకరంగా మారతాయి. మెరిసే నక్షత్రాల కింద టెంట్లలో క్యాంపింగ్ చేయడం భలే సరదాగా ఉంటుంది.
కాశ్మీర్‌లోని శ్రీనగర్ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా దాల్ లేక్ రాత్రిపూట అద్భుతంగా ఆకట్టుకుంటాయి. సరస్సులోని హౌస్‌బోట్లు, వాటిపై వెలిగే దీపాలు నీటిలో రిఫ్లెక్ట్ అవుతూ మరింత అందాన్ని కలిగిస్తాయి. చుట్టూ మంచుతో కప్పుకున్న పర్వతాలు, చల్లని వాతావరణం ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు. ఇక్కడి పిచోలా సరస్సు రాత్రిపూట పర్యాటకులను కట్టిపడేస్తుంది. సరస్సు చుట్టూ ఉన్న రాజభవనాలు, హోటళ్లు దీపాల కాంతిలో మెరిసిపోతుంటాయి. ముఖ్యంగా సిటీ ప్యాలెస్ వెలుగులు నీటిలో ప్రతిబింబించే విజువల్స్ చూసి వారెవ్వా అనాల్సిందే.
ఈ ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు ముందుగా అక్కడి వెదర్ కండీషన్స్ ను ముందుగా తెలుసుకోవాలి. ఈ ప్రాంతాలను చూసేందుకు ఏ సమయాల్లో అనుమతిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రాత్రిపూట ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎడారి, మంచు ప్రాంతాలకు వెళ్లే వాళ్లు అక్కడి వాతావరణానికి తగిన దుస్తులు తీసుకెళ్లాలి.
పర్యాటకం అంటే కేవలం పగటిపూట అందాలను చూడటమే కాదు. కొన్ని ప్రదేశాలను రాత్రిపూట చూస్తే వాటి అందం మరింత రెట్టింపవుతుంది. అందుకే, మీరు కూడా ఈ ప్రాంతాలను చూసేందుకు ట్రై చేయండి.
Read Also:రైల్వే గ్రూప్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. ఇక ఎన్ని బెర్తులైనా బుక్ చేసుకోవచ్చా?