World Longest Train: దాదాపు 7.6 కిలోమీటర్ల పొడవు, 696 వ్యాగన్లతో కూడిన ఒక భారీ గూడ్స్ రైలును విజయవంతంగా పరీక్షించి దక్షిణాఫ్రికా ప్రపంచ రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆ దేశ ప్రభుత్వ రవాణా అండ్ లాజిస్టిక్స్ సంస్థ అయిన ‘ట్రాన్స్‌నెట్’ (Transnet) ఈ అద్భుత ఘనతను సాధించింది. దక్షిణాఫ్రికా పశ్చిమ తీరంలోని సల్దాన్హా బే నుంచి దేశ అంతర్భాగంలోని ఇనుప ఖనిజం గనుల వరకు 860 కిలోమీటర్ల మేర ఈ రైలు తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. రెండు రోజుల పాటు సాగిన ఈ ట్రయల్ రన్‌లో వ్యాగన్లన్నింటినీ ఖాళీగానే నడిపారు.
సాధారణంగా గూడ్స్ రైళ్లు కేవలం 0.8 నుండి 2.4 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. వాటితో పోలిస్తే 7.6 కిలోమీటర్ల (4.7 మైళ్లు) పొడవున్న ఈ రైలు భారీ సరుకు రవాణా విభాగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. ఈ ప్రయోగం ద్వారా దక్షిణాఫ్రికా గత 25 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసింది. 2001లో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఒక గని నుండి ఓడరేవుకు ఇనుప ఖనిజాన్ని తరలించిన 7.24 కిలోమీటర్ల (4.5 మైళ్లు) పొడవైన రైలు పేరిట ఇప్పటివరకు ఈ రికార్డు ఉండేది. దీనిని దక్షిణాఫ్రికా తిరరాయడం విశేషం.
అయితే దీనిని కేవలం ఒక రికార్డు కోసమే కాకుండా తమ అవసరాల కోసం ఈ పొడవైన రైలును నిర్మించినట్లు ట్రాన్స్‌నెట్ సంస్థ స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాలకు ఖనిజాలు, ఇతర సరుకులను సమర్థవంతంగా రవాణా చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని ట్రాన్స్‌నెట్ ఫ్రైట్ రైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రస్సెల్ బాట్జీస్ తెలిపారు. ప్రయాణ సమయంలో రైలు పనితీరును నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న అంచనాలతో వాస్తవ ఫలితాలను పోల్చి చూసేందుకు ఈ డేటాను ఉపయోగిస్తామన్నారు.
Also Read: నర్సు ఉద్యోగానికి గుడ్ బై.. 7 నెలల్లోనే రూ.1.75 కోట్ల సంపాదన.. కంటెంట్ క్రియేషన్ పవర్ అంటే ఇదీ!
అయితే ఈ రైలులో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి అనుమతి లేదు. ఇది ప్యాసింజర్ సర్వీస్ కాదని.. కేవలం దేశ సరుకు రవాణా సామర్థ్యాన్ని, ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ఖనిజాలను తరలించే శక్తిని పరీక్షించడానికి మాత్రమేనని అధికారులు పేర్కొన్నారు. ఏదేమైనా ఈ రైలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. రైలు పొడవు, దాని శక్తి సామర్థ్యం, సరుకు రవాణా పరిమితులను అధిగమించడంలో దక్షిణాఫ్రికా సాధించిన ఈ విజయం.. ప్రపంచ రైల్వే రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తోంది.
Also Read: భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?