Special trains 2025: గణపతి బప్పా మోరియా అంటూ దేశమంతా ఉత్సాహంగా వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ ఉత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. కొంకణ్ వైపు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది గణేష్ ఉత్సవం సందర్భంగా సెంట్రల్ రైల్వే 250, వెస్ట్రన్ రైల్వే 5 ప్రత్యేక రైళ్లు కలిపి మొత్తం 280కి పైగా స్పెషల్ ట్రైన్లు నడిపించబోతున్నాయి. ఇది కొంకణ్ ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు నిజంగా శుభవార్తగా చెప్పుకోవచ్చు.
ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 10, 2025 వరకు నడవనున్నాయి. ప్రధానంగా ముంబై, పుణె, డివా వంటి ప్రాంతాల నుంచి కొంకణ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రత్నగిరి, సావంతవాడి, మడ్గావ్, చిప్లున్ లాంటి నగరాలకు ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. ప్రతిరోజూ నడిచే రైళ్లతో పాటు వారానికి కొన్ని రోజులు మాత్రమే నడిచే స్పెషల్ రైళ్లను కూడా రైల్వేలు అమలులోకి తీసుకువచ్చాయి.
సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లలో CSMT నుంచి సావంతవాడికి, రత్నగిరికి, LTT నుంచి మడ్గావ్, సావంతవాడి రోడ్‌లకు రైళ్లు నడవనున్నాయి. ఉదాహరణకు, 01151/01152 CSMT.. సావంతవాడి రోడ్ డెయిలీ స్పెషల్ రైలు ప్రతిరోజూ అర్థరాత్రి 12:20కి ముంబయి నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం గమ్యస్థానానికి చేరుతుంది. తిరుగు ప్రయాణం అదే రోజు సాయంత్రం 3:35కి మొదలవుతుంది. ఇలా మొత్తం 40 సర్వీసులు ఈ మార్గంలో నడవనున్నాయి.
ఇలానే, 01103/01104, 01153/01154, 01167/01168, 01171/01172 వంటి రైళ్లు కూడా ప్రతిరోజూ నడవనున్నాయి. ఇందులో రాత్రి వేళలలోనే కాకుండా, ఉదయం, మధ్యాహ్న సమయంలో బయలుదేరే రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే పుణె – రత్నగిరి, డివా – చిప్లున్ వంటి మార్గాల్లో వారానికొకసారి రైళ్లు నడవనున్నాయి. ఇందులో డివా – చిప్లున్ MEMU రైళ్లు 38 ట్రిప్స్ నిర్వహించనుండగా, ఇవి నాన్ – రిజర్వ్డ్ ట్రైన్లుగా ఉండబోతున్నాయి.
ఇక వెస్ట్రన్ రైల్వే కూడా గణపతి స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 5 ప్రత్యేక రైళ్లు – వీటితో 44 ట్రిప్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ముంబయి సెంట్రల్ – తోకూర్, బాంద్రా టెర్మినస్ – రత్నగిరి, వడోదరా – రత్నగిరి, విశ్వామిత్రి – రత్నగిరి వంటి మార్గాల్లో ప్రయాణికులకు వీటివల్ల ఉపయోగం కలుగుతుంది.
Also Read: Srisailam villages name change: ఈ గ్రామాల పేర్లు ఓ వెరైటీ.. అందుకే మార్చారు.. ఇకపై ఇలా పిలవండి!
ప్రత్యేక రైళ్ల బుకింగ్‌లు కూడా ముందుగానే ప్రారంభమవుతున్నాయి. సెంట్రల్ రైల్వే ట్రైన్ల కోసం జూలై 24, వెస్ట్రన్ రైల్వే ట్రైన్ల కోసం జూలై 23, 2025 నుండి టికెట్ల అమ్మకం మొదలవుతుంది. యుటిఎస్ మొబైల్ యాప్, రైల్వే కౌంటర్లు వంటి అన్ని సాధారణ మార్గాల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. కావున, ప్రయాణికులు ఆలస్యం చేయకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈసారి గణపతి పండుగకు ముందస్తు ప్రణాళికలతో రైల్వే శాఖ చేసిన ఏర్పాట్లు అభినందనీయమని ప్రయాణికులు అంటున్నారు. వేడుకల సమయంలో రద్దీని తగ్గించడమే కాదు, భక్తుల ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రతి చిన్న వివరాన్ని పరిగణలోకి తీసుకుని ట్రైన్ సర్వీసులు ప్లాన్ చేశారు. ముంబై నగరం నుంచి కొంకణ్ వరకూ లక్షలాది మంది గణేష్ భక్తులు ప్రయాణించే సందర్భంలో, రైల్వే స్పెషల్ రైళ్లు అందించటం భక్తుల ఆనందానికి హద్దులేదన్న మాట. పైగా, ఆన్ టైమ్ సర్వీసులతో పాటు, భద్రతా జాగ్రత్తలు, మెరుగైన శుభ్రత వంటి అంశాలపై కూడా రైల్వేలు దృష్టి పెట్టాయి.
ఈ నేపథ్యంలో, మీ గణేష్ ఉత్సవం అద్భుతంగా ఉండాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని సురక్షితంగా ప్రయాణించండి. ఆనందంగా, భక్తిశ్రద్ధలతో కూడిన ఈ పండుగను గడపండి. ఇది కేవలం ట్రైన్ ప్రయాణం కాదు.. మీ భక్తి ప్రయాణమని చెప్పవచ్చు.