Goa history: భారతదేశం అనేది ఎన్నో రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు కలిసిన అద్భుతమైన దేశం. ఇక్కడ మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్నింటి విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, మరికొన్నింటి జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో అత్యల్ప విస్తీర్ణం కలిగి, కేవలం రెండు జిల్లాలే కలిగిన ఒక చిన్న రాష్ట్రం ఉంది. అదే గోవా.
రెండు రాష్ట్రాలు ఎందుకు?
గోవా రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నార్త్ గోవా, రెండవది సౌత్ గోవా. ఈ రెండు జిల్లాలే గోవా మొత్తాన్ని కవర్ చేస్తాయి. వినడానికి ఇది చిన్నదిగా అనిపించినా, గోవా పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఆకర్షణీయంగా బీచ్‌లు
గోవా అరేబియా సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. అందుకే ఇక్కడ బీచ్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు గోవాకు చేరుకుంటారు. బీచ్‌లు మాత్రమే కాదు, ఇక్కడి పచ్చని కొండలు, నదులు, చారిత్రక కట్టడాలు, పండుగలు కూడా గోవాకు ప్రత్యేకతని ఇస్తాయి.
గోవా చరిత్ర
చరిత్ర విషయానికి వస్తే, గోవా దాదాపు 451 సంవత్సరాల పాటు పొర్చుగీస్ పాలనలో ఉంది. 1510లో పొర్చుగీస్ వారు ఇక్కడ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి 1961 వరకు వారు పాలించారు. అందుకే ఇక్కడి సంస్కృతి, నిర్మాణ శైలి, ఆహార అలవాట్లలో యూరోపియన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గోవాలోని చర్చిలు, ఫోర్టులు ఇవన్నీ ఆ కాలానికి చెందినవే.
గోవాకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఎప్పుడు వచ్చింది?
1961లో భారత సైన్యం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆ తర్వాత గోవా విముక్తి చెందింది, భారతదేశంలో కలిసింది. మొదట ఇది కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగింది. కానీ 1987లో గోవాకు ప్రత్యేక రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుంచి గోవా భారతదేశపు 25వ రాష్ట్రంగా అవతరించింది.
ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే, 1961కి ముందు గోవాలో జన్మించిన వారికి భారత పౌరసత్వంతో పాటు పోర్చుగీస్ పౌరసత్వం పొందే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగా గోవా ప్రజల్లో చాలా మంది యూరప్ దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.
భారతదేశపు చిన్న ముత్యం గోవా
ఈ రోజుల్లో గోవా అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? బీచ్‌లు, క్రిస్మస్ వేడుకలు, చర్చిలు, రాత్రి సంబరాలు, రుచికరమైన సముద్ర ఆహారం. పర్యాటకులకు గోవా ఒక కలల గమ్యం. అక్కడి వెళ్లిన వారికి సముద్రాలు, ప్రశాంతమైన గాలిలో మనకు నచ్చిన విధంగా ఉండటం. ఒకరికి ఒకరు ప్రపంచాన్ని మరిచి, నచ్చిన విధంగా గడపడమే గోవా.
నార్త్ గోవా- సౌత్ గోవా ఇందులో ఏది బెస్ట్
ముందుగా నార్త్ గోవా గురించి మాట్లాడుకుంటే, నార్త్ గోవా అంటే ఎప్పుడూ సందడి, ఉత్సాహం నిండిన ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన బీచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. కాండోలిమ్, అంజునా, కాలంగుట్ వంటి ప్రదేశాలు యువతకు హాట్ స్పాట్‌లా ఉంటాయి. నైట్ లైఫ్, మ్యూజిక్ ఫెస్టివల్స్, మార్కెట్లు, పబ్‌లు, కాసినోలు అన్నీ ఇక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. గోవా వచ్చి ఎంజాయ్ చేయాలని భావించే వారికి నార్త్ గోవా సరైన ఎంపిక అవుతుంది.
సౌత్ గోవా
సౌత్ గోవా మాత్రం నార్త్‌కి పూర్తిగా భిన్నం. ఇక్కడ బీచ్‌లు ప్రశాంతంగా ఉంటాయి, జన సందడి తక్కువగా ఉంటుంది. పాలోలెం, అగొండ, కొల్వా బీచ్‌లు ప్రకృతి అందాలను ఆస్వాదించేవారికి అద్భుతంగా ఉంటాయి. దూద్‌సాగర్ జలపాతం ప్రకృతి అందాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. నిశ్శబ్ద వాతావరణం, పచ్చని ప్రకృతి, మనసు ప్రశాంతత కోరుకునేవారికి సౌత్ గోవా బెస్ట్. కుటుంబంతో వెళ్ళేవారు, హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసేవారు సాధారణంగా సౌత్ గోవానే ఇష్టపడతారు.
ఇలాంటి గోవాలో రెండు రాష్ట్రాలే ఉండటం ఎంత విచిత్రం కదూ.. ఇది రెండు రాష్ట్రాలైన ప్రపంచాన్నే తన వద్దకు రప్పించుకుంటుంది. వర్షాకాలంలో నీలి ఆకాశం, సముద్రపు అలలను చూస్తూ గడపడం ఎంత మనస్సుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఊహ చాలు అక్కడి వెళ్లి గడపడానికి. గోవా చిన్నదైనా, చరిత్రలో ప్రత్యేకత, ప్రకృతిలో అందం, సంస్కృతిలో వైవిధ్యం ఇవన్నీ కలిపి గోవాను భారతదేశపు చిన్న ముత్యంలా నిలబెట్టాయి. ఆలస్యం ఇంకెందుకు! వర్షాకాలంలో గోవా పచ్చదనం, జలపాతాలు, సముద్రతీరాలు మరో రూపంలో మెరిసిపోతాయి. ఇప్పుడే ట్రిప్ ప్లాన్ చేసి అసలైన గోవా అందాలను ఆస్వాదించండి.