Dasara festival 2025: నవరాత్రి పండుగ అంటే భక్తి, ఆనందం, శుభకార్యాల సమాహారం. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడానికి ఎంతో ప్రత్యేకమైన సమయం. ఉదయాన్నే లేచి ఆలయ దర్శనం, శ్లోకాలు, వ్రతాలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉపవాసం చేయడం ద్వారా మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగే మన ఆహారంలో లైట్‌గా, తేలికైన వంటకాలను ఎంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.
ఇందులో ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిని వ్రతకాలంలో దూరంగా పెట్టే సంప్రదాయానికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో “వ్రత థాలీ”ని సిద్ధం చేస్తే భక్తితో పాటు రుచిని కూడా ఆస్వాదించవచ్చు.
మొదటగా సామా అన్నం, అంటే ఇది సాధారణ అన్నానికి బదులు వాడే మంచి ఆప్షన్. కడుపుని నింపుతుంది కానీ భారంగా ఉండదు. దీన్ని తక్కువ మసాలాలతో చేసుకుంటే వ్రతానికి అద్భుతంగా సరిపోతుంది.
దీనితో పాటు ఆలుగడ్డ కూర తప్పనిసరిగా వ్రత థాలీలో ఉంటుంది. టమోటా, పచ్చి మిర్చి, కొత్తిమీరతో సింపుల్‌గా చేసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ లేకుండా కూడా ఈ కూర వ్రతానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Also Read: Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!
పచ్చడి కూడా తప్పనిసరి. పుదీనా, కొత్తిమీర, పెరుగు కలిపి చేసుకున్న పచ్చడి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది అన్నం, రోటీ రెండింటికీ సరిపోతుంది.
తరువాత వడలు, సబుదాన వడలు గాని, సేనగపప్పు వడలు గాని థాలీలో వేసుకుంటే భోజనానికి కమ్మదనాన్ని జోడిస్తాయి. ఇవి బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. ఉపవాస సమయంలో తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.
పాయసం డెజర్ట్‌గా తీసుకుంటే థాలీ పూర్తయినట్లే. బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారుచేసిన పాయసం, పండుగల సమయంలో తీపి వంటకంగా మాత్రమే కాకుండా, పూజలలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
ఈ వంటకాలతో పాటు నవరాత్రి సమయంలో పండ్లు, పొడి పళ్ళు తినడం కూడా శక్తినిస్తుంది. బాదం, కాజు, ఖర్జూరం వంటివి శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇస్తాయి. ఉపవాసం చేస్తున్నవారికి ఇవి సహజమైన బలాన్ని ఇస్తాయి.
ఇలాంటి వ్రత థాలీ కేవలం ఆహారం మాత్రమే కాదు, పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరినీ కలిపే బంధంలాంటిది. అమ్మవారికి నైవేద్యం పెట్టి, కుటుంబంతో కలిసి ఈ వంటకాలను తినడం వల్ల భక్తి, ఆనందం రెట్టింపవుతాయి. అందుకే ఈ నవరాత్రి మీరు కూడా తప్పక ఒకసారి ఇలాంటి “వ్రత థాలీ”ని తయారు చేసి చూడండి. మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పండుగను మరింత ఆనందకరంగా మార్చుతుంది.