Pushkaralu Trains: దశాబ్దంలో ఒకసారి వచ్చే పుణ్యకాలం దగ్గరపడుతున్న తరుణంలో, రైల్వే శాఖ భారీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా తరలివచ్చే ఈ పుష్కరాల నేపథ్యంలో, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం, పుష్కరఘాట్లు కలిగిన ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్ల సేవలను అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ప్రత్యేకంగా రైల్వే యార్డులనూ, గూడ్స్ సైడింగ్‌లనూ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను, ప్రవేశ – నిష్క్రమణ మార్గాలను DRM స్థాయిలో పరిశీలిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా హోల్డింగ్ ఏరియాలు, కంట్రోల్ రూమ్‌లు, భద్రతా చర్యలు కూడా అమలులోకి వస్తున్నాయి. భక్తుల రద్దీ పీక్స్ లో 40 లక్షల మందిని ఎదుర్కొనే విధంగా రైల్వే ముందస్తు చర్యల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో స్పెషల్ రైళ్ల ప్రారంభానికి తుది తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు అధికారులు సంకేతాలు ఇచ్చారు.
2027లో గోదావరి నదీ తీరాల్లో జరగబోయే పుష్కరాల పర్వదినాల కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ భారీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 40 లక్షల మంది పైగా భక్తులు రైల్వే మార్గంలో ప్రయాణించే అవకాశం ఉండటంతో, ప్రత్యేక రైళ్లు, హాల్ట్లు, శాశ్వత, తాత్కాలిక వసతులపై దృష్టి పెట్టారు. పుష్కరాల వేళ భక్తుల రాకపోకల నేపథ్యంలో విజయవాడ డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా స్వయంగా తనిఖీలు నిర్వహించడం దీనికి నిదర్శనం.
భక్తుల రాకపోకల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల సమీక్ష
పుష్కరాల సమయంలో గందరగోళం లేకుండా భక్తులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి బయటకు వెళ్లేలా ఎంట్రీ – ఎగ్జిట్ మార్గాలపై DRM ప్రత్యేకంగా సమీక్షించారు. కాకినాడ పోర్ట్ స్టేషన్, KSPL సైడింగ్, ఇతర కీలక స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FOBs), సర్క్యులేటింగ్ ఏరియాలు, హోల్డింగ్ జోన్లు, డ్రాప్ ఆఫ్, పికప్ పాయింట్లు గుర్తించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రతి ఒక్క భక్తుడి ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే!
గత పుష్కరాల అనుభవాల్ని పునరావృతం చేయకుండా, ఈసారి ప్రయాణికుల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యంగా సాగాలన్నదే విజయవాడ రైల్వే డివిజన్ లక్ష్యం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, రాజమండ్రి, కొవ్వూరు, పోలవరం, భద్రాచలం ప్రాంతాల కోసం ప్రత్యేక రైళ్లకు హాల్ట్లు, గమ్యస్థానాలు, షెడ్యూల్ లు ఇప్పటికే ప్రణాళిక దశలో ఉన్నాయి.
ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించడమే కాదు, అదే సమయంలో సరుకు రవాణా (కార్గో) వేగంగా సాగేందుకు కాకినాడ గూడ్స్ సైడింగ్ వంటి కీలక కేంద్రాలపై DRM ప్రత్యేక దృష్టి పెట్టారు. వాగన్ డిటెన్షన్ తగ్గించేందుకు, లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
పోర్ట్ – రైల్వే సమన్వయంతో వేగవంతమైన సేవలు
కాకినాడ పోర్టులో KSPL siding పై జరిగిన DRM సమీక్షలో పోర్ట్ యాజమాన్యంతో సమన్వయాన్ని బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఫాస్ట్ టర్న్ అరౌండ్ టైమ్ కోసం టెక్నికల్ టీమ్‌లతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోర్ట్‌కు వచ్చే గూడ్స్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే ట్రాక్ చేస్తూ, సమయాన్ని ఆదా చేయాలన్నదే ప్రధాన ఆలోచన.
Also Read: Best Lakes in India: ఇదొక మాయా ప్రపంచం.. ఒకసారి వెళ్తే మరిచిపోలేరు.. మీదగ్గరే ప్లాన్ చేసుకోండి!
ఎక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్?
పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వీటిలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, భువనేశ్వర్, ముంబయి, వారణాసి, తిరుపతి, నాగపట్నం ముఖ్యమైనవి. ప్రత్యేక హాల్ట్‌లు, షెడ్యూల్లు, కోచ్ కంపోజిషన్ తదితర అంశాలపై ఇప్పటికే రైల్వే బృందాలు అధ్యయనం చేస్తున్నాయి.
పుష్కరాలు కేవలం భక్తి పర్వదినాలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి పెద్ద వేదిక కూడా. ఈ సమయంలో లక్షలాది మంది రాకపోకల మధ్య రైల్వేలు సమర్థవంతమైన వాహన సౌకర్యం, భద్రత, వేగవంతమైన ఫ్రెయిట్ సేవలను అందించే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాయి.
ఈ సారి మీరు బస్సు కోసం ఆగాల్సిన అవసరం లేదు..!
మీరు రైలు ఎక్కడ నుంచి వస్తుందా? ఎప్పుడు వస్తుందా? అన్నదానికంటే ఎంతో త్వరగా మీ గమ్యానికి ఎలా చేరుకోవాలా? అనేదే మిగిలే ప్రశ్న. ఎందుకంటే, రైల్వేలు ఇప్పటికే మీ కోసం మార్గాలు సిద్ధం చేశాయి. ఈసారి పుష్కరాలకు వెళ్లే రైలు మీకు ముందే సిద్ధంగా ఉంటుంది. మీ భక్తి ప్రయాణానికి రైల్వే సంపూర్ణ మద్దతు ఇస్తోంది.. సిద్ధం కండి!