Railway updates: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైలు రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని బికనూరు – తాళమండ్ల రైల్వే సెక్షన్ వద్ద వరద నీరు రైలు పట్టాల కింద నిల్వ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా రైళ్లను నిలిపివేసి, అనేక సర్వీసులను డైవర్షన్ చేయడం జరిగింది.
రైల్వే అధికారులు విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, అక్కన్నపేట – మెదక్ సెక్షన్ పరిధిలో పలు రైళ్ల మార్గాలను మళ్లించారు. ఇందులో ముంబై నుండి లింగంపల్లి, లింగంపల్లి నుండి ముంబై, ఓఖా నుండి రామేశ్వరం, అలాగే భగత్ కోఠి నుండి కాచిగూడ వరకు నడిచే ముఖ్యమైన సర్వీసులు ఉన్నాయి. ఈ రైళ్లు ప్రస్తుతం నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, కాజీపేట, సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా మళ్లింపులు చేయబడి నడుస్తున్నాయి.
భారీ వర్షాల ప్రభావంతో రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా, పలు స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే నిజామాబాద్ నుండి తిరుపతి వెళ్ళాల్సిన రాయలసీమ ఎక్స్ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. అంతేకాదు, కాచిగూడ నుండి మెదక్ వెళ్ళే ట్రైన్ సర్వీసును పాక్షికంగా రద్దు చేసి ప్రయాణికులకు సమాచారం అందించారు.
రైల్వే అధికారులు తెలిపారు, వర్షాల ప్రభావం తగ్గే వరకు పరిస్థితిని సమీక్షిస్తూ రైలు రాకపోకలను సవరించుకుంటామని. భద్రతే ప్రధానమని స్పష్టం చేసిన వారు, ట్రాక్‌లపై నిలిచిన నీరు తొలగించే వరకు మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతుండడంతో రైల్వే సిబ్బంది పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణానికి సంబంధించిన సమాచారం కోసం 139 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!
రైళ్ల డైవర్షన్ వల్ల అనేక ప్రయాణికులు మార్గమధ్యంలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రయాణికులు రైళ్లు ఆలస్యమవ్వడం వల్ల గమ్యస్థానాలకు చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది సహాయం అందిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ వరదల కారణంగా రైలు రాకపోకల్లో అంతరాయం ఏర్పడటం తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రయాణికులపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముంబై, రామేశ్వరం, తిరుపతి వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రైలు సర్వీసులపై ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా రైల్వే యాప్ ద్వారా వెంటనే తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడే వరకు రైల్వే అధికారులు జాగ్రత్త చర్యలు కొనసాగిస్తారని హామీ ఇస్తున్నారు.