ఆహ్లాదకరంగా రైలు ప్రయాణం చేయాలనుకుంటే ముందుగా బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలి. ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, బెర్త్ బుక్ చేసుకున్నప్పటికీ, కొంత మంది టికెట్ లేని వాళ్లు ఆయా సీట్లలో కూర్చుంటారు. టికెట్ తీసుకున్న ప్రయాణీకులు వారిని లేవాలని చెప్పినా, అంగీకరించరు. ఒక్కోసారి గొడవకు దిగుతారు. అలాంటి సమయంలో వారితో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా సీటు పొందేందుకు సాయం చేసేందుకు భారతీయ రైల్వే పలు రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE), రైల్ మద్దత్ పోర్టల్, హెల్ప్ లైన్ 139ని ఉపయోగించి మీ సమస్యకు పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది.
కన్ఫార్మ్ టికెట్ ఉన్న వారికి ప్రయాణ సమయంలో సదరు సీటు మీద పూర్తి హక్కులు ఉంటాయి. సరైన రిజర్వేషన్ లేకుండా ఎవరైనా సీటులో కూర్చున్నట్లయితే, వారిని ఆ సీటు నుంచి పంపించే అధికారం రైల్వే అధికారులకు ఉంటుంది. రిజర్వు చేయడిని బెర్త్ ఎలా పొందాలో చెప్పే రైల్వే రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరైనా మీ సీటులో కూర్చున్నట్లు అయితే, వెంటనే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)కు చెప్పాలి. మీ టికెట్ ను తనకు చూపించి బెర్త్ ఇప్పించాలని కోరాలి. TTE ఇతర ప్రయాణీకుల టికెట్‌ను తనిఖీ చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు.
రైల్ మద్దత్ అనేది ప్రయాణ సమయంలో ఫిర్యాదులు చేసే రైల్వే అధికారిక పోర్టల్. మీ మొబైల్ నంబర్, OTPతో లాగిన్ కావాలి. ముందుగా PNR వివరాలను ఎంటర్ చేయాలి. సంబంధిత ఫిర్యాదును సెలెక్ట్ చేయాలి. సమస్యను స్పష్టంగా రాసి సబ్మిట్ చేయాలి. మీ కంప్లైంట్ పరిష్కారం కోసం విధుల్లో ఉన్న రైల్వే సిబ్బందికి పంపబడుతుంది.
భారతీయ రైల్వే అధికారిక హెల్ప్ లైన్ 139కి కూడా కాల్ చెయ్యొచ్చు. మీరు సమస్యను నేరుగా చెప్పడంతో పాటు SMS పంపే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణీకులను రైల్వే అధికారులతో అనుసంధానిస్తుంది. వారు రైల్లోని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?
TTE ద్వారా సీటు వివాదం పరిష్కారం కాకపోతే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లేదంటే ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సహాయం కోరవచ్చు. వారి జోక్యంతో ద్వారా సీటును పొందే అవకాశం ఉంటుంది.
Read Also:మెట్రో ప్రారంభమైన 3 రోజులకే గుట్కా మరకలు, మరీ ఇలా తయారయ్యారేంట్రా?