India Pak Ceasefire Saudi| గత నెలలో జరిగిన ఇండియా పాకిస్థాన్ యుద్దం ఆగిపోవడానికి తానే కారణమని.. తాను పెద్దమనిషిగా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చినాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నాడు. పలు సందర్భాల్లో ఏ చిన్న అవకాశమొచ్చినా తన గురించి తనే గొప్పలు చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఇదంతా ఆయన చేసిన ఘన కార్యం కాదు మరో దేశ నాయకుడు చేసిన కృషి వల్ల జరిగిందని స్వయంగా పాకిస్థాన్ ప్రకటించింది.
భారతదేశం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా వైమానిక దాడుల తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికాతో పాటు సౌదీ అరేబియాతో కూడా సంప్రదింపులు జరిపినట్లు పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ ఇటీవల ధృవీకరించారు. పాక్ మీడియా సంస్థ జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు తెలియజేశారని దార్ వెల్లడించారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ఆపడానికి సౌదీ అరేబియా రహస్య దౌత్యంలో పాల్గొన్నట్లు సూచిస్తోంది.
యుద్ధ సమయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ ఇండియాకు గట్టిగా సమాధానం ఇచ్చామని చెప్పారు. ఇండియాపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఆయన ప్రకటించుకున్నారు. కానీ ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా తాజాగా పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలున్నాయి. దార్ మీడియాతో ఈ విషయంపై స్పష్టతనిస్తూ.. “పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ మరియు షోర్‌కోట్ వైమానిక స్థావరాలతో సహా కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ కచ్చితంగా దాడుల చేసింది. భారత్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ఇదంతా జరిగింది. సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ నాకు ఫోన్ చేసి, పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉందని జైశంకర్‌కు చెప్పవచ్చా అని అడిగారు.” అని దార్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ నాయకత్వం గతంలో చేసిన అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి.
భారత్ దాడుల తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ సైన్యం.. భారత్ ఆకస్మిక దాడుల ప్రభావంతో కలవరపడింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్.. భారత్ చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. అంటే, సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంబంధిత స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయడం చాలా ప్రమాదకర ధోరణి అని చెప్పారు. “భారత్ సరిహద్దులను ఇష్టానుసారం దాటడం ఒక ప్రమాదకర ధోరణి,” అని వాషింగ్టన్‌లో జరిగిన ఒక సమావేశంలో మునీర్ అన్నారు.
ప్రధాని షరీఫ్ కూడా ఇటీవల.. భారత్ చేసిన బ్రహ్మోస్ క్షిపణి దాడులు.. రావల్పిండి విమానాశ్రయంతో సహా బహుళ ప్రాంతాలను భారీ నష్టం చేకూర్చాయని ఒప్పుకున్నారు. “భారత్ మళ్లీ బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసింది. రావల్పిండి విమానాశ్రయంతో సహా వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది,” అని షరీఫ్ చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పాక్ వైఖరిలో పూర్తి మార్పును సూచిస్తున్నాయి.
Also Read: మిడిల్ ఈస్ట్‌లో భారీగా మోహరించిన అమెరికా సైన్యం.. ఇరాన్‌పై దాడికి స్టెల్త్ బాంబర్లతో సిద్దం
మరోవైపు ఇండియాలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్షాలు పాకిస్తాన్ పై దాడులు ఒక్కసారిగా ఆపేసినందుకు తీవ్రంగా విమర్శించాయి. ట్రంప్ బాహాటంగా తన వల్లే ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని తను చెప్పడం వల్లే ఇండియా దాడులు ఆపేసిందని గొప్పలు చెప్పుకుంటుండడంతో ప్రధాని మోడీ.. అమెరికా ఒత్తిడికి తలొగ్గారంటూ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు స్వయంగా పాకిస్తాన్ ఇదంతా సౌదీ యువరాజు చొరవ చూపడంతో సాధ్యమైందని చెప్పడం గమనార్హం.