Indian Railways: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్. ఇండియాలోని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇదీ ఒకటి. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరింత వేగంగా ప్రయాణిస్తుంది. అక్టోబర్ 15, 1993లో ఈ రైలు తన సర్వీసులను మొదలుపెట్టింది. హైదరాబాద్ లోని ఫేమస్ ఫలక్ నుమా ప్యాలెస్ కు పేరును ఈ రైలుకు పెట్టారు. దేశంలోని అత్యంత దూర ప్రయాణం చేసే రైళ్లలో ఫలక్ నుమా ఒకటిగా కొనసాగుతోంది. ఈ రైలు మొత్తం 1,540 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. దీని ప్రయాణ సమయం ఏకంగా 25 గంటల 40 నిమిషాలు. సికింద్రాబాద్ నుంచి – హౌరాకు వెళ్లే ఇతర రైళ్లతో పోల్చితే ఇది నల్లగొండ, గుంటూరు మీదుగా షార్ట్ కట్ లో వెళ్తుంది.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ వివరాలు
12703 నెంబర్ గల ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 3.55 నిమిషాలకు బయల్దేరుతుంది. సుమారు 26 గంటల పాటు ప్రయాణం చేసి, మరుసటి రోజు సాయంత్రం 6.10 గంటలకు హౌరాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12704) ఉదయం హౌరాలో 8.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో హాల్టింగ్ తీసుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళ రోడ్, పలాస, ఇచ్చాపురం మీదుగా ఈ రైలు హౌరాకు చేరుకుంటుంది. ఈ రైలులో ఏసీ ఫస్ట్ క్లాస్ తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్ లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది.
పలుమార్లు ప్రమాదాలకు గురైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్-హౌరా మధ్య రాకపోకలు కొనసాగించే ఈ రైలు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యింది. కానీ, పెద్ద ప్రాణ నష్టం జరిగిన సందర్భలు లేవు. మున్ముందు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరాకు వెళ్తుండగా రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయాయి. విడిపోయిన బోగీల్లో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన రైల్వే అధికారులు మందస స్టేషన్ దగ్గర రైలును నిలిపివేశారు. విడిపోయిన బోగీలను కలిపి మళ్లీ పంపించారు. బోగీల మధ్య ఉండే కప్లింగ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు. గతంలో కొన్నిసార్లు ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. 2023లో హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న సమయంలో గుంటూరు- నల్లగొండ మధ్యలో రైలులో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా పొగ అలముకుంది. దీంతో ప్రయాణీకులు ఏం జరుగుతుందో అర్దం కాలేదు. వెంటనే చైన్ లాగి రైలును ఆపటంతో వెంటనే అందరూ కిందకు దిగేసారు. ఏడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
Read Also: 4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!