Train Passenger Death Compensation: తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభావాన్ని అందిస్తుంది భారతీయ రైల్వే సంస్థ. సుదూర ప్రయాణాలు చేసే వారిలో ఎక్కువ మంది రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారు. రోజూ సుమారు 20 వేల రైళ్లు దేశ వ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రయాణీకుల భద్రత, శ్రేయస్సు కోసం భారతీయ రైల్వే సంస్థ పలు రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రయాణీకుల మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఇప్పుడు మనం ప్రయాణీకులకు సంబంధించిన ఓ కీలక రూల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైలు ప్రయాణంలో ప్యాసింజర్ సహజ మరణం పొందితే పరిహారం ఇస్తారా?
రైలు ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్ ప్రమాదవశాత్తు చనిపోతే రైల్వేశాఖ పరిహారం అందిస్తుంది. అయితే, ప్రయాణీకుడు సహజంగా చనిపోతే, రైల్వేశాఖ పరిహారం అందిస్తుందా? అనేది చాలా మందిలో తలెత్తే ప్రశ్న. సాధారణంగా ప్రయాణీకుడు తన లగేజీ కోల్పోయిన సందర్భంలో, ప్రాణ నష్టం జరిగినప్పుడు రైల్వేశాఖ బాధ్యత వహిస్తుంది. అయితే, అన్ని సందర్భాల్లోనూ ఈ రూల్ వర్తించదు. జరిగిన ఆస్తి నష్టం లేదంటే ప్రాణ నష్టానికి రైల్వే సంస్థ, రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యం కారణం అయినప్పుడు మాత్రమే బాధ్యత వహిస్తుంది. పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణీకుడు సహజ మరణం పొందితే రైల్వేశాఖ ఎలాంటి బాధ్యత వహించదు. అంతేకాదు, ఎలాంటి పరిహారం కూడా అందించదు. ఒకవేళ మెడికల్ సాయం కావాలంటే రైల్వే సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తారు.
Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?
రైలు ప్రమాదం చనిపోతే ఎంత పరిహారం లభిస్తుందంటే?
ప్రయాణ సమయంలో రైలు ప్రమాదానికి గురై ప్రయాణీకుడు చనిపోతే ఎంత పరిహారం అందిస్తుంది? అనే విషయంలోనూ చాలా మంది పెద్దగా అవగాహన ఉండదు. రైల్వేశాఖ తమ ప్రయాణీకుల కోసం అత్యంత సరసమైన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో కేవలం 45 పైసలతో ఈ పాలసీని తీసుకుంటే, రూ. 10 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీని ప్రయాణీకులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. IRCTC సైట్ లో టికెట్ బుక్ చేస్తున్న సమయంలో ఈ పాలసీ తీసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రైలు ప్రమాదం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రయాణీకుడు రైలు ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా అతడి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా అందుతుంది. తాత్కాలిక వైకల్యం పొందితే రూ. 7.50 లక్షలు, స్వల్పగాయాలు అయితే రూ. 2 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అన్నట్లు ఈ పాలసీ అనేది కేవలం ప్రయాణ సమయంలోనే వర్తిస్తుంది. అంటే, ప్రయాణీకుడు రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన సమయం నుంచి ముగించే సమయం వరకే వ్యాలీడ్ అవుతుంది. ఒక్కసారి రైలు దిగితే ఈ బీమా వర్తించదు.
Read Also: అన్ని లైన్లలో.. ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనేది లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుంది?