Hyderabad 1981 vs Today: ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం, వేలాది చెరువులతో అలరారిన హైదరాబాద్ నగరం.. గత నాలుగు దశాబ్దాల్లో అనూహ్యమైన మార్పులకు లోనైంది. 1981 నాటి గణాంకాలతో ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూసినప్పుడు.. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అదే సమయంలో పర్యావరణంపై ఎంత భారం పడిందో స్పష్టమవుతోంది. 1981 నాటి భాగ్యనగరానికి.. ప్రస్తుత హైదరాబాద్ నగరానికి ఉన్న తేడా ఏంటో గణాంకాల రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1981లో హైదరాబాద్ జనాభా కేవలం 25.46 లక్షలుగా ఉండేది. కానీ నేడు ఆ సంఖ్య ఏకంగా 1.13 కోట్లకు చేరుకుంది. ఉపాధి, విద్య, వ్యాపార అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వలస రావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే జనాభాకు తగ్గట్టుగానే నగర విస్తీర్ణం కూడా గణనీయంగా విస్తరించింది. నాలుగు దశాబ్దాల క్రితం 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ సుందర నగరం.. ఇప్పుడు 625 చదరపు కిలోమీటర్లకు విస్తరించి కాంక్రీట్ జంగిల్ గా మారింది. చుట్టుపక్కల పల్లెలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ నగరీకరణ పెరిగిన కొద్దీ ప్రకృతి వనరులపై తీవ్ర ప్రభావం పడుతూ వచ్చింది. 1981లో నగరంలో 19.4 శాతంగా ఉన్న పచ్చదనం (Vegetation) ఇప్పుడు ఏకంగా 8.2 శాతానికి పడిపోయింది. భవనాలు, రహదారుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక చెరువుల విషయంలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకప్పుడు 3,500 చెరువులతో కళకళలాడిన భాగ్యనగరం.. ప్రస్తుతం కేవలం 650 చెరువులు మాత్రమే మిగిలి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆక్రమణలు, కాలుష్యం కారణంగా వేలాది జలవనరులు కనుమరుగైపోవడం భవిష్యత్తు నీటి అవసరాలకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.
అటు రవాణా రంగంలో వచ్చిన మార్పులు సైతం హైదరాబాద్ రూపురేఖలను మార్చేశాయి. 1981లో కేవలం 2.1 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య.. నేడు 94.78 లక్షలకు చేరుకోవడం రహదారులపై ట్రాఫిక్ రద్దీని, వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని భారీగా పెంచుతోంది. మరోవైపు 1981లో 9.1 శాతంగా ఉన్న భవన నిర్మాణ ప్రాంతం (బిల్ట్-అప్ ల్యాండ్) ఇప్పుడు 56.5 శాతానికి ఎగబాకింది. ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, చెరువుల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్ మెంట్లు, వాణిజ్య సముదాయాలు నగరంలో పెద్ద ఎత్తున వెలిశాయి.
Also Read: బిస్లరీ ఎఫెక్ట్.. ప్యాకేజ్డ్ వాటర్ నాణ్యతపై FSSAI కొరడా.. దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరణ!
ఈ రోజుల్లో ఏ నగరానికి అయినా అభివృద్ధి అనేది అనివార్యమే. ఈ క్రమంలోనే హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ లను సైతం నిర్వహిస్తోంది. అయితే ఓ వైపు అభివృద్ధి, మరోవైపు పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎల్లప్పుడూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇకనైనా మిగిలి ఉన్న చెరువులను పరిరక్షించడం, పచ్చదనాన్ని పెంచడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్ పూర్వ వైభవాన్ని కాపాడాలని కోరుతున్నారు.