Tubeless Tyre Puncture Driving Car| మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? వెంటనే కారు ఆపేస్తారా? లేదా కొంత దూరం వెళ్లినా పర్లేదని ముందుకు సాగుతారా? చాలామంది ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయినా గాలి నెమ్మదిగా తగ్గుతుందని భావించి కారును నడుపుతుంటారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయితే ఎంత దూరం ప్రయాణించవచ్చు? ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే కారు ఆపేయాలి? ఈ విషయాలు తెలుసుకోండి.
ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయినప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చాలామంది భావిస్తారు. అయితే ఇలా చేయడం సురక్షితమని కచ్చితంగా చెప్పలేం. టైర్‌లో ఎంత గాలి మిగిలింది, పంక్చర్ ఎంత పెద్దది అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. చిన్న పంక్చర్ అయితే గాలి నెమ్మదిగా బయటకు వెళుతుంది. అలాంటప్పుడు సమీపంలోని సురక్షిత ప్రదేశానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద పంక్చర్ అయితే గాలి వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా కారుని సురక్షితమైన ప్రదేశంల ఆపి సహాయం తీసుకోవాలి.
టైర్‌లో గాలి పూర్తిగా పోయిన తర్వాత కూడా కారును నడపడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల టైర్ లోపలి నిర్మాణం దెబ్బతింటుంది. అంతేకాకుండా వీల్ రిమ్ వంగిపోయే లేదా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే టైర్ పూర్తిగా గాలి కోల్పోతే వెంటనే కారు ఆపేయాలి. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లేదా పంక్చర్ రిపేర్ సర్వీస్ సహాయం తీసుకోవాలి.
టైర్‌లో గాలి తక్కువగా ఉన్నప్పుడు దాని సైడ్‌వాల్స్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో టైర్ సాధారణం కంటే ఎక్కువగా వంగుతుంది. ఫలితంగా టైర్ లోపల వేడి పెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, కారు బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కారు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
టైర్‌లో మేకు లేదా స్క్రూ ఇరుక్కున్నట్లు కనిపిస్తే వెంటనే దాన్ని బయటకు తీయకూడదు. అది గాలి బయటకు వెళ్లకుండా కొంతవరకు అడ్డుకుంటుండవచ్చు. దాన్ని తీస్తే గాలి వేగంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కారు సురక్షిత ప్రదేశంలో ఆపి మెకానిక్‌తో చెక్ చేయించాలి. టైర్ రిపేర్ చేయవచ్చా లేదా మార్చాలా అనేది నిపుణులు నిర్ణయిస్తారు.
Also Read: ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? జాగ్రత్త ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి
దూర ప్రయాణానికి వెళ్లే ముందు అన్ని టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ పాటించాలి. టైర్లపై పగుళ్లు, కోతలు, అసాధారణమైన అరుగుదల ఉన్నాయేమో పరిశీలించాలి. అలాగే కారులో స్పేర్ టైర్, అవసరమైన టూల్స్, ట్యూబ్‌లెస్ పంక్చర్ కిట్ ఉంచుకోవాలి. టైర్‌కు సరిపడే సీలెంట్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవచ్చు. అయితే ప్రతి పంక్చర్‌ని సీలెంట్‌తో రిపేర్ చేయడం సాధ్యం కాదు.