Thiruparankundram Deepam: తమిళనాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం (Thirupparankundram) కొండపై ఉన్న రాతి స్తంభం (దీపత్తూణ్) వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై మధురై జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ఆలయ ధర్మకర్తల మండలి సహకరించకపోవడం వల్లే ఈ కార్యక్రమం జరగలేదని స్పష్టం చేసింది. సాంప్రదాయకంగా వెలిగించే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోనే దీపం వెలిగించాలని వారు నిర్ణయించుకున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ కోర్టుకు నివేదించారు. కోర్టు తీర్పును అమలు చేయలేకపోయినందుకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
నవంబర్ 24న సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య ఒకే ఒక్కసారి రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే దేవస్థానం ద్వారా అధికారికంగా నియమించబడిన బృందం మాత్రమే దీపం వెలిగించాలని తీర్పు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఆలయ ట్రస్టీలు అనుమతి నిరాకరించిన తర్వాత వారి స్థానంలో వేరొకరిని నియమించే లేదా జోక్యం చేసుకునే చట్టపరమైన అధికారం రెవెన్యూ, పోలీసు శాఖలకు లేదని కోర్టుకు కలెక్టర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని కలెక్టర్ విన్నవించారు.
కోర్టు ఆదేశాల అమలు కోసం నవంబర్ 20 నుంచి 24 మధ్య పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ అధికారులతో మూడుసార్లు సమావేశాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 5,000 మందికి పైగా పోలీసులు, వైద్య, అగ్నిమాపక బృందాలను కొండపై మోహరించినట్లు కోర్టుకు చెప్పారు. తీర్పు వచ్చిన మర్నాడే అంటే నవంబర్ 22వ తేదీనే ఆలయ ఈవోకి దీపం వెలిగించే అంశంపై ప్రతిపాదనలు పంపినట్లు కూడా కోర్టుకు కలెక్టర్ తెలిపారు.
దీని ప్రకారం నవంబర్ 24 ఉదయం 6 గంటలకు 27 మందితో కూడిన సిబ్బంది కొండపైకి వెళ్లి ఏర్పాట్లు చేయాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఇద్దరు అర్చకుల నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం దీపం వెలిగించాల్సి ఉందని చెప్పారు. కానీ 24వ తేదీ ఉదయం 6 గంటలకు సిబ్బంది కొండపైకి వెళ్లలేదని సుప్రీంకోర్టుకు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. దీనిపై ఉదయం 10:08 గంటలకు ఈవోకు ఈమెయిల్ పంపి వివరణ కోరగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు 11:30 గంటలకు బదులిచ్చినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే నిషేధాజ్ఞలను సవాలు చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉందనే సాకుతో జాప్యం చేయకూడదని కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఈవో, ఆలయ ట్రస్టీలకు హైకోర్టు సాయంత్రం 4:30 గంటలకు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే 5:03 గంటలకు ఆలయ అధికారులకు కలెక్టర్ అత్యవసర మెయిల్ పంపారు. కొండపై పరిశీలకులు, భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వెంటనే దీపం వెలిగించే బృందాన్ని పంపాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల జోక్యాన్ని కూడా కోరారు.
Also Read: ఇసుక మాఫియా ఆగడాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్!
అయితే తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా సాయంత్రం 6 నుంచి 6:30 గంటల మధ్య ఏ బృందం కొండపైకి చేరుకోలేదని కలెక్టర్ సుప్రీంకోర్టు తెలిపారు. ఆలయ అర్చకులు సాయంత్రం 6 గంటలకు యథావిధిగా ఉచ్చిపిళ్లైయార్ ఆలయ మండపంలోనే మహాదీపం వెలిగించారని స్పష్టం చేశారు. కాగా, రాత్రి 8:30 గంటలకు ఆలయ ఈవో నుంచి కలెక్టర్కు ఒక నివేదిక అందింది. అందులో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని జతచేశారు. దాని ప్రకారం అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయం పురాతన ఆగమ శాస్త్ర నిబంధనలను అనుసరిస్తుందని ట్రస్టీలు తమ తీర్మానంలో పేర్కొన్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మూలవిరాట్టుకు సరిగ్గా పైన ఉండే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలోనే కార్తీక మహాదీపం వెలిగించాలని వారు నిర్ణయించినట్లు చెప్పారు. మెుత్తంగా ఆలయ ట్రస్ట్ నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతోనే రాతి స్తంభం వద్ద దీపం వెలిగించలేకపోయామని కలెక్టర్ తన నివేదికలో సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు.