Hyderabad High-Speed Rail Plan: సౌత్ ఇండియన్ టాప్ సిటీ హైదరాబాద్ మీదుగా త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు తీయనుంది. రీసెంట్ గా హైదరాబాద్ నగరానికి సంబంధించిన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ ను ఇతర ప్రధాన నగరాలతో వేగంగా కలిపే హైస్పీడ్ రైలు ప్రణాళికలపై కీలక చర్చ జరిగింది. బెంగళూరు, చెన్నై, పూణే లాంటి నగరాలకు నేరుగా వేగవంతమైన రైలు సౌకర్యం కల్పించడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అమలు అయితే, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు, ప్రయాణ సౌలభ్యం లాంటి అంశాల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి.
అటు ప్రాంతీయ రింగ్ రైల్ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర పరిసర ప్రాంతాలు మరింత మెరుగ్గా అనుసంధానమవుతాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. నగరానికి వచ్చే, వెళ్లే వాహనాల ఒత్తిడిని తగ్గించేందుకు మరింత సాయపడనుంది.
ఈ సమావేశంలో పలు ఇతర ప్రాజెక్టుల గురించి కూడా పరిశీలించారు. రైల్వే లైన్ల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టారు. అలాగే, రోడ్డు మీద రైల్వే లైన్లకు సంబంధించిన అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.
ఈ ప్రాజెక్టులను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భూసేకరణ, అవసరమైన అనుమతులు, ట్రాఫిక్ మళ్లింపు, యుటిలిటీ సేవల తరలింపు లాంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ముందుకు సాగుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరారు. ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణానికి అవసరమైన ఖర్చులో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ అంశంపై కూడా చర్చలు జరిగాయి.
సమావేశంలో పాల్గొన్న ముఖ్య కార్యదర్శి రామకృష్ణ అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనులు సమయానికి పూర్తి కావాలంటే సంబంధిత విభాగాల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. అలాగే, ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సమావేశం ఓ ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరానికి మంచి కనెక్టివిటీ లభించడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.
Read Also: స్లీపర్ బస్సులు బ్యాన్.. ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!