Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా పెరిగిన ఛార్జీలను సవరించింది. 10 శాతం తగ్గింపు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు మే 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా మెట్రో ఛార్జీలు రూ. 2 నుంచి రూ. 15 వరకు పెరిగాయి. ఈ ధరలపై ప్రయాణీకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో యాజమాన్యం ధరల పెంపుపై పునరాలోచన చేసింది. ఈ మేరకు పెరిగిన ధరలపై 10 శాతం తగ్గింపును ప్రకటించింది.
ఈ నెల 15న పెరిగిన మెట్రో ధరలు
ఈనెల 15న మెట్రో ధరలు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టికెట్ ధర మీద 20 శాతం పెంచింది. పెరిగిన ధరలు మే 17 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, దేశంలో ఎక్కడగా లేని విధంగా హైదరాబాద్ మెట్రో ధరలు పెరగడంతో ప్రయాణీకులతో పాటు విపక్ష పార్టీల నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మెట్రో పెంచిన ధరపై రాయితీ ప్రకటించిస్తూ నిర్ణయం తీసుకుంది.
ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పిన మెట్రో!
గతంతో పోల్చితే ప్రస్తుతం మెట్రో మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగినట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. మెట్రో నిర్వహణ సక్రమంగా కొనసాగాలంటే ధరల పెంపు తప్పని సరి అని ప్రకటించింది. కనిష్ట టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 12 వరకు పెంచారు. గరిష్ట టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కు హైక్ చేశారు. ప్రయాణీకల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో మెట్రో సంస్థ టికెట్ ధరలను 10 శాతం తగ్గించింది.
మెట్రోపై ఉచిత బస్సు ఎఫెక్ట్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. ఈ ఎఫెక్ట్ మెట్రో మీద బాగా పడింది. మెట్రో ఆదాయం తగ్గుతూ వచ్చింది. నష్టాన్ని పూడ్చుకోవడానికి టికెట్ ధర పెంపు ఒక్కటే మార్గంగా భావించి మెట్రో ధరలను పెంచింది. పెంచిన ధరలో నెలకు అదనంగా రూ. 200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మెట్రో అంచనా వేసింది. కానీ, 20 శాతం ధరల పెంపుపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రయాణీకులపై కాస్త భారం తగ్గనుంది. నిత్యం మెట్రో ప్రయాణం చేసే వేలాది మంది ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరనుంది.
ధర తగ్గింపుపై మెట్రో ఎండీ ఏమన్నారంటే?
ప్రయాణీకుల అభిప్రాయం ప్రకారం.. తాజాగా పెంచిన ధరపై 10 శాతం తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. “ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మెట్రో కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగాలంటే టికెట్ ధరల పెంపు తప్పని సరి. కానీ, ప్రయాణీకులపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇటీవల పెంచిన ధరపై 10 శాతం తగ్గింపును ప్రకటిస్తున్నాం” అని తెలిపారు.
Read Also: విజయవాడ-బెంగళూరు రూట్ లో వందేభారత్, ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!