Vijayawada-Bangalore Vande Bharat: ఏపీ ప్రజలకు ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతుండగా, ఇప్పుడు మరో రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. విజయవాడ- బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నడిపించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రైలు ప్రారంభం అయితే, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
జస్ట్ 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు..
ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణీకులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వస్తే, కేవలం 9 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుత ప్రయాణ సమయంతో పోల్చితే 3 గంటల సమయం సేవ్ కానుంది. విజయవాడ నుంచి బయల్దేరే ఈ రైలు తిరుపతి మీదుగా బెంగళూరుకు చేరుకోనుంది. ఇటు విజయవాడ నుంచి అటు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తులకు కూడా ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుంది.
మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో..
విజయవాడ- బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం మినహా వారానికి 6 రోజులు నడుస్తుంది. ఈ రైలుకు మొత్తం 8 బోగీలు ఉంటాయి. వాటిలో 7 ఏసీ చైర్ కార్, ఒక ఎగ్జిక్యుటివ్ చైర్. 20711 నెంబర్ గల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం 5.15 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్ గా ఇదే రైలు బెంగళూరు నుంచి 2.45 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?
విజయవాడ నుంచి 5.15 గంటలకు బయల్దేరే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెనాలికి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే ఈ రైలు బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై.. కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ 23.45 గంటలకు చేరుకుంటుంది.
Read Also: టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ బంపర్ ఆఫర్!
రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా..
ఇక ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులకు మచిలీపట్నం నుంచి యశ్వంత్ పూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ రైలు కేవలం వారానికి 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. విజయవాడ- బెంగళూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వస్తే, రోజూవారీ ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Read Also: వందే భారత్ స్లీపర్ రైల్లో సరికొత్త టెక్నాలజీ.. రైల్వే చరిత్రలోనే తొలిసారి!