దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అంటే.. వెంటనే కన్యాకుమారి- దిబ్రూఘర్ వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు అని చెప్పేస్తారు. ఇది అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి బయల్దేరి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. మొత్తం 4,218 కి.మీ జర్నీ చేస్తుంది. ఆసియా ఖండంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. 2012లో ఈ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో మొత్తం 59 చోట్ల ఈ రైలు ఆగుతుంది. ఇండియన్ రైల్వేలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ రైల్లో భరించలేని దుర్వాసన, కంపుకొట్టే టాయిలెట్లు, అపరిశుభ్రమైన వాష్ బేసిన్లను కలిగి ఉంది. ఈ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి రైల్ మద్దత్ కు లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయి.
రీసెంట్ గా ఓ ట్రావెల్ వ్లాగర్ ఈ రైల్లోని పరిస్థితుల గురించి ఓ వీడియోను షేర్ చేశాడు. అప్పటి వరకు ఈ రైలు అపరిశుభ్రత గురించి విన్న విషయాలన్నీ నిజమేనని తేల్చాడు. ఈ వీడియోను చూసి నెటిన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి ఛార్జీ చెల్లించి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, అత్యంత అపరిశుభ్రమైన కోచ్ లలో ప్రయాణించాల్సి వచ్చిందని, భారతీయ రైల్వే తమను నిరాశపరిచిందంటూ చాలా మంది ప్రయాణీకులు కామెంట్స్ పెట్టారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లు, రాజధాని ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం సర్వీసులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, అనేక ఇతర రైళ్లలో పారిశుధ్యం సమస్య తీవ్రంగా ఉందనే ఆందోళనకరంగానే ఉందంటున్నారు.
ప్రయాణీకుల ఫిర్యాదుల ఆధారంగా సహర్స-అమృత్ సర్ గరీబ్ రథ్ భారతదేశంలో అత్యంత మురికి రైళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. జోగ్ బాని-ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్ ప్రెస్, బాంద్రా టెర్మినస్-మాతా వైష్ణో దేవి స్వరాజ్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్ పూర్-అగర్తల త్రిపుర సుందరి ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని వెనక్కి నెట్టి న్యూఢిల్లీ-దిబ్రుగఢ్ ఎక్స్ ప్రెస్ తొలి స్థానంలోకి వచ్చింది. ఈ రైల్లో పరిశుభ్రమైన నీరు లేకపోవడం, మురికి దుప్పట్లు, బెడ్ షీట్లు, విరిగిన సీట్లు, పేలవమైన డస్ట్ బిన్ లు ఉన్నట్లు ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న కోచ్ ల నుంచి టాయిలెట్లలో అపరిశుభ్రత గురించి భారతీయ రైల్వేకు అనేక ఫిర్యాదులు అందినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ సమస్యలకు సంబంధించి భారతీయ రైల్వేకు 1,00,280కి పైగా ఫిర్యాదులు వచ్చాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఇటీవల వెల్లడించింది. అయితే, ఆయా సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పడం విశేషం.
Read Also: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!