Indian Railway Complaints: రైలులో మీకు సమస్యనా.. మీ సీట్లో వేరేవారు కూర్చున్నారా.. మీకు ఇచ్చిన ఆహారం నాణ్యత లేదా.. రైలు పరిశుభ్రంగా ఉందా.. మీ ప్రయాణం అసౌకర్యంగా సాగుతోందా.. మిమ్మల్ని ఆకతాయిలు వేధిస్తున్నారా.. మీరు రైలు దిగుతూ.. మీ సామాన్లు మరచిపోయారా.. వీటన్నింటికి ఒకటే పరిష్కారం కనుగొంది రైల్వేశాఖ. నేటి రోజుల్లో రవాణా వ్యవస్థలో రైల్వే శాఖ కీలకపాత్ర పోషిస్తోంది. రోజుకు లక్షల్లో ప్రయాణికులు రైళ్ల ద్వారా తమ రాకపోకలు సాగిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణంకు మించినది లేదన్నది ప్రయాణికుల అభిప్రాయం. అందుకే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల రైల్వే ప్రయాణికుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రైల్వే ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 ను ప్రవేశపెట్టి ప్రయాణీకుల సమస్యలను పరిష్కరిస్తోంది. అయితే అన్ని వేళలా ఈ సదుపాయం పొందేందుకు ఇబ్బందులు కలుగుతున్నట్లు పలువురు ప్రయాణికులు తెలుపుతున్నారు. ప్రధాన కారణం లైన్స్ బిజీగా ఉండడం, మరొక ప్రయాణికుడి సందేహాలు తీర్చే క్రమంలో కొంత సేవలు పొందేందుకు జాప్యం జరుగుతుందట. అందుకు రైల్వేశాఖ సరికొత్త నిర్ణయంతో సోషల్ మీడియాను కూడా వినియోగించాలని భావించింది. అనుకున్నదే తడవుగా అన్ని సమస్యలకు పరిష్కారంగా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసింది రైల్వే శాఖ.
ట్విట్టర్ లో indian railway complaints పేరిట పేజీని రైల్వే శాఖ ఓపెన్ చేయగా, ఎవరైనా రైల్వే ప్రయాణం సమయంలో ఏ సమస్య ఎదుర్కొన్నా.. ఒక్క ట్వీట్ చేస్తే సరి. సెకన్ల వ్యవధిలో ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రెస్పాండ్ కావడం, మరలా మీ సమస్య పరిష్కారమైందా లేదా అంటూ ట్వీట్ చేయడం.. ఇలా ఈ ట్విట్టర్ పేజీ విజయవంతంగా సాగుతోంది. ఇటీవల ఓ రైల్వే ప్రయాణికుడు తొందరగా రైలు నుండి దిగుతూ.. తన బ్యాగు మరచిపోయాడు. వెనువెంటనే ట్వీట్ చేసి దానిని indian railway complaints పేజీకి ట్యాగ్ చేశాడు. అంతే కేవలం 30 నిమిషాల వ్యవధిలో సదరు ప్రయాణికుడికి అందజేశారు. ఆ ప్రయాణికుడు రైల్వే సేవలపై హర్షం వ్యక్తం చేస్తూ.. గుడ్ జాబ్ రైల్వే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Also Read: Be Alert: ట్రింగ్.. ట్రింగ్.. హలో.. ఒకటి నొక్కండి చాలు.. అధోగతే!
ఇలా రోజుకు వందల సంఖ్యలో indian railway complaints పేజీకి సమస్యలు వస్తుండగా, ప్రతి సమస్యకు శుభం కార్డు వేస్తోంది రైల్వే శాఖ. దీనితో రైల్వే సేవలపై ప్రయాణికులు అభినందనలు తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా తమ సెల్ఫీ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఏదిఏమైనా రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడి కష్టంను.. అమిత వేగంతో స్పందిస్తూ పరిష్కరిస్తున్న రైల్వే శాఖకు, సంబంధిత అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలపాల్సిందే. మరి మీరు కూడా రైలు ప్రయాణంలో ఏ సమస్య ఎదుర్కొన్నా, అధికారులు స్పందించి సహాయం చేసినా ఈ ట్విట్టర్ పేజీకి ట్యాగ్ చేయడం మరచిపోవద్దు సుమా!